నవ్వడమే కాదు నవ్వించడం కూడా మరిచిపోతున్నారు | Comedy Disappear Telugu Movies Slowly present | Sakshi
Sakshi News home page

Comedy: టాలీవుడ్‌లో కామెడీ ఖేల్ ఖతం.. ఏమవుతోంది?

May 6 2026 4:31 PM | Updated on May 6 2026 4:37 PM

Comedy Disappear Telugu Movies Slowly present

'నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం'.. ఈ సామెత మీలో చాలామంది వినే ఉంటారు. కానీ మీలో ఎంతమంది మనస్పూర్తిగా ఓ సినిమా చూసి నవ్వుతున్నారు? అని అడిగితే చాలామంది దగ్గర సమాధానముండదు. ఎందుకంటే జీవితంలో ఎవరికి వాళ్లు బిజీ అయిపోతున్నారు. నవ్వడం అనే విషయాన్ని రోజురోజుకీ మర్చిపోతున్నారు. ఒకప్పుడు బాధల్ని కాసేపు పక్కనబెట్టి మనసారా నవ్వుకునేందుకు సినిమాకు వెళ్లేవాళ్లు. ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో కామెడీ అరుదుగా మారిపోయింది. దాదాపు కనుమరుగైపోయే స్థితికి వచ్చేసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

ఒకప్పుడు తెలుగులో ఏడాదికి కనీసం 20-30 సినిమాలైనా కామెడీవి వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి అంటే ఒకటో రెండో అని వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి. దీనికి చాలా కారణాలున్నాయి. హీరోల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. ఎందుకంటే స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, మహేశ్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు తమ తమ సినిమాల్లో కొంత మేర అయినా కామెడీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కత్తి పట్టి విలన్లని నరకడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. దర్శకులు కూడా అలానే తయారవడం ఆందోళన కలిగిస్తోంది.

అహ నా పెళ్లంట, జంబలకడిపంబ, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు.. కామెడీ కోసం ఇప్పటితరం కూడా పాత సినిమాల్నే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడొచ్చే వాటిలో సరైన కామెడీ ఉండట్లేదు. ఉన్నా సరే క్రింజ్, సిల్లీ కామెడీ ఉంటున్నాయి. వాటికి జనాలు నవ్వకపోగా దాన్ని చూసి కామెడీ ఇలా ఉందేంటి అని మరోలా నవ్వుకుంటున్నారు.

ఒకప్పుడు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవన్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఈవీవీ, సునీల్.. ఇలా చెప్పుకొంటూ పోతే పదుల సంఖ్యలో హాస్య నటులు ఉండేవారు. వీళ్ల కోసం రచయితలు.. ఆయా సినిమాల్లో సెపరేట్‌గా కామెడీ ట్రాక్స్ రాసేవాళ్లు. అవి ఎంతలా వర్కౌట్ అయ్యేవి అంటే ఇప్పటికీ 'సొంతం' మూవీ అంటే సునీల్ మాత్రమే గుర్తొంచేంతలా. ఇందులో సునీల్ హీరో కాదు గానీ అంతలా అందరికీ గుర్తుండిపోయాడు.
దూకుడు లాంటి సినిమాల్లోనూ హీరోకి సరిసమానంగా బ్రహ్మానందం పాత్ర ఉండే విషయం మర్చిపోకూడదు. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు తమ సినిమాల్లో దాదాపు కమెడియన్లు అందరినీ పెట్టి అద్భుతంగా నవ్వించేవాళ్లు.

కానీ ఇప్పటి దర్శకులకు సరైన కామెడీ రాయడం చేతకావట్లేదు! ఒకవేళ రాసినా సరే ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని భయపడి చస్తున్నారు. ఎందుకీ బాధ అని ప్రతిఒక్కరూ రక్తపాతం టైపు స్టోరీలే తీస్తున్నారు. ఒకప్పుడు కోన వెంకట్ లాంటి రచయితలు శ్రీనువైట్ల లాంటి దర్శకుల దగ్గర ఉండేవారు. కానీ ఇప్పుడొస్తున్న దర్శకులంతా క్రెడిట్ అంతా తమకే దక్కాలని చూస్తూ రైటర్స్‌ని పెద్దగా ప్రోత్సాహించకపోవడం కూడా కామెడీ తగ్గిపోవడానికి కారణమని చెప్పొచ్చు.

ప్రేక్షకుల విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలో కామెడీని కామెడీగా మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఏమైనా తేడా అనిపిస్తే ట్రోల్ చేసిపడేస్తున్నారు. లేదంటే క్రింజ్ కామెడీ అని ముద్రవేస్తున్నారు. మరోవైపు మొబైల్‌లోని యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్‌లో కనిపించే ఫాస్ట్ కామెడీకి అలవాటు పడిపోయి సినిమాల్లో నిదానంగా బిల్డ్ అయ్యే కామెడీని ఓపికతో చూడలేకపోతున్నారు. ఇలా అన్నివైపుల నుంచి పలు సమస్యల వల్ల హాస్యం అనేది ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై తెలుగు దర్శకనిర్మాతలు కాస్త దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే కొన్నాళ్లకు పూర్తిగా కామెడీ ఇక కనిపించదేమో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement