‘ఆచార్య’ టెంపుల్‌ సెట్‌పై చిరు ఆసక్తికర ట్విట్‌

Chiranjeevi Shares A Glimpse Of Acharya Temple Town Set - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఆ సెట్‌  ప్రత్యేకత ఏంటంటే.. 20 ఎకరాల్లో దాన్ని నిర్మించారు. మన దేశంలో ఓ సినిమా కోసం అన్ని ఎకరాల్లో అంత భారీ సెట్‌ వేయడం ఇదే ప్రప్రథమం అట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవియే వెల్లడించారు. అంతేకాదు ఆ సెట్‌ యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ, దాన్ని రూపొందించిన టెక్నీయన్లకు ట్విటర్‌ వేదికగా చిరంజీవి థ్యాంక్స్‌ చెప్పారు.
(చదవండి : వంద స్మార్ట్‌ఫోన్లు గిప్ట్‌ ఇచ్చిన రియల్‌ హీరో)

‘ఆచార్య సినిమా కోసం ఇండియా అతి పెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్‌, 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలి గోపురం, ఆశ్చర్యంగొలిపేలా ప్రతి చిన్న చిన్న డిటేల్స్‌ని అద్భుతంగా మలిచారు. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చనటిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను. నిజంగానే ఒక టెంపుల్‌ టౌన్‌లో ఉన్నామా అనేంతగా ఈ సెట్‌ని నిర్మించిన కళా దర్శకుడు సురేష్‌,  ఈ టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన డైరెక్టర్ కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించడానికి అవసరమైన వనరులను ఇచ్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్‌ చరణ్ లను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు' అని చిరంజీవి అన్నారు.

ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే.. ఇందులో చిరు సరసన కాజల్‌ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top