‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్‌ ఇది! | Chiraiya Web Series Review In Telugu | Sakshi
Sakshi News home page

Chiraiya Review: ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్‌ ఇది!

Apr 8 2026 7:17 PM | Updated on Apr 10 2026 3:50 PM

Chiraiya Web Series Review In Telugu

ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దు ఉండకపోవచ్చు గాని వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు, సరిహద్దులతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. స్నేహితులైనా, కుటుంబసభ్యులైనా అంతెందుకు కట్టుకున్న భాగస్వామికి అయినా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి అనే సందేశాన్ని సుస్పష్టంగా ఇచ్చిన సిరీస్ చిరయ్యా. దివి నిథి శర్మ ఆలోచనకు శశాంత్ సింగ్ దర్శకత్వం వహించి తెర రూపమిచ్చిన సిరీసే ఈ చిరయ్యా. చాలా సున్నితమైన అంశాన్ని చక్కటి డ్రామాతో 6భాగాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు.

పెళ్ళైతే చాలు కట్టుకున్న పెళ్ళాం ఇష్టం తో పని లేకుండా తనని తన సొంత ఆస్తిలా భావించే ప్రబుద్ధులకు ఈ సిరీస్ ఓ గుణపాఠమనే చెప్పాలి. హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతున్న ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. కాని చూసిన ప్రతి ప్రేక్షకుడి మనస్సు చివుక్కుమనడం ఖాయం.  పెళ్లైన ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్‌ ఇది.  అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓసారి చూద్దాం. 

పెద్దలు కుదిర్చిన సంబంధంతో పూజ అరుణ్ ని పెళ్ళి చేసుకుని అత్తింట్లో అడుగుపెడుతుంది. అత్తమామలు ఇద్దరితో పాటు మిగతా కుటుంబసభ్యులంతా ఎంతో అపురూపంగా చూసుకుంటారు పూజని. ఆ కుటుంబంలో అరుణ్ వదిన దివ్య మొదట్లో పూజని కాస్త బెట్టుగా చూసినా తరువాత కలిసిపోతుంది. అందరూ బాగున్నా అరుణ్ తో పూజకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య గురించి తాను ఎవ్వరితో చెప్పుకోలేదు. అప్పుడు దివ్యకి పూజ సమస్య తెలుస్తుంది. 

కన్నబిడ్డ కన్నా ఎంతో అనురాగఆప్యాయతలతో పెంచిన అరుణ్ అసలు స్వరూపం తెలుసుకున్న దివ్య పూజకి ఎలాంటి పరిష్కారం చూపుతుందో చిరయ్యా సిరీస్ చూసే తెలుసుకోవాలి. నిజానికి ఈ సిరీస్ లోని పాయింట్ చాలా సున్నితమైన అంశం. దర్శకుడు ఎక్కడా అశ్లీలతకు ఎక్కువగా తావివ్వకుండా ఎంతో హుందాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతే ధీటుగా ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునేలా ఉందీ సిరీస్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పరిష్కారం సూపర్ అని చెప్పాలి.  పెద్దలు మాత్రమే చూడదగ్గ ఈ సిరీస్ వీకెండ్ కు మంచి కాలక్షేపం.
-హరికృష్ణ ఇంటూరు

Advertisement
 
Advertisement
Advertisement