పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు | Buchi Babu Special Interview About Peddi Movie | Sakshi
Sakshi News home page

పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు

Jun 2 2026 7:25 PM | Updated on Jun 2 2026 7:44 PM

Buchi Babu Special Interview About Peddi Movie

‘పెద్ది’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన బుచ్చిబాబు

‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌ తీసుకొని ‘పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 4న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘పెద్ది’ ఎలా మొదలైంది?
నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్  నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. ఉప్పెన తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సినిమా కదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇందులో హీరో క్రికెట్‌తో పాటు మరో రెండు ఆటలు కూడా ఆడతాడు. దాని కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం.క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్  ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.

పెద్ది  విజయం ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కదా?
ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్‌ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.

‘పెద్ది’ కథ ముందు ఎన్టీఆర్‌ కోసం రాసుకున్నారా?
లేదు. ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం  తయారు చేసిన కథ.

చరణ్ ని అంత ఈజీగా ఎలా కన్విన్స్ చేశారు?
అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను. చరణ్ ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశాం.

జాన్వీ కపూర్‌ పాత్ర ఎలా ఉంటుంది?
జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.

శివరాజ్‌ కుమార్‌, జగపతి బాబు పాత్రల గురించి చెప్పండి
ఇందులో శివన్న  ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు  అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.

రెండో సినిమాకే రూ. 350 కోట్ల బడ్జెట్‌.. ఎలా అనిపిస్తోంది?
ఇది చరణ్ గారి వల్లే సాధ్యమైంది. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే కథకు కావాల్సినవి జరగకపోవచ్చు.

ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారని విన్నాం?
లేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం.

ఏఆర్ రెహమాన్ గారి గురించి?
నాకు రోజా, బొంబాయి..  రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.

మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు ‘పది కేజీఎఫ్‌లతో సమానం’ అన్నారు. మరి పెద్ది గురించి?
పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు(నవ్వుతూ..)

షూటింగ్‌ సమయంలో చరణ్‌కు చాలా గాయాలయ్యాయని విన్నాం?
అవును. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్‌లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ).

చరణ్ గారి ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి?
పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది.

క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది ఎలా ఉంటుంది?
ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారు.

చిరంజీవి గారు సినిమా చూశారా?
-ఇంకా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.

పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?
ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement