
బాహుబలి సినిమా (Bahubali Movie)తోనే పాన్ ఇండియా ట్రెండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలాయి. దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తరణకు బాహుబలి తోడ్పడింది. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి (Sridevi) నటించాల్సిందట!
ఇప్పటికీ నా దగ్గరే..
శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నారు. మరి అదెందుకు కార్యరూపం దాల్చలేదన్నదానిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) స్పందించాడు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సినిమా కోసం ఆమె చెప్పిన సూచనలు విన్నాక ఆయనకు శ్రీదేవిపై గౌరవం రెట్టింపైంది. కానీ, నిర్మాతల వల్ల ఆ సినిమా తను చేయలేకపోయింది.

చాలా తక్కువ పారితోషికం
రాజమౌళి మా ఇంటికి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గది నుంచి బయటకు వెళ్లగానే నిర్మాతలు ఎంటరయ్యేవారు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు శ్రీదేవి తీసుకున్నదానికంటే కూడా తక్కువే ఇస్తామన్నారు. ఆమె చిన్న నటి కాదు కదా! తనవల్ల సినిమాకు కూడా ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. తమిళం, హిందీలోనూ కొంత పాపులారిటీ వస్తుంది. అలాంటప్పుడు నా భార్యను ఒక మెట్టు దిగి సినిమా చేయమని నేనెందుకు చెప్తాను?
రివర్స్‌లో చెప్పారు
కానీ నిర్మాతలు మాత్రం రాజమౌళికి అంతా రివర్స్‌లో చెప్పారు. హోటల్‌లో ఒక ఫ్లోర్ మొత్తం తనే కావాలంటోందని చాడీలు చెప్పారు. మేము అడిగిందొక్కటే.. మా పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు పెద్ద షెడ్యూల్ పెట్టుకోమన్నాము. అంతకుమించి పెద్ద డిమాండ్లేమీ చేయలేదు. కానీ నిర్మాతలు రాజమౌళికి వేరేవిధంగా ఎక్కించారు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఇలాంటి పుకార్లు సృష్టించాడు. తను ప్రొఫెషనల్‌గా ఉండదని కామెంట్ చేశాడు.

రూ.10 కోట్ల డిమాండ్?
అదే నిజమైతే రాకేశ్ రోషన్, యష్ చోప్రా, రాఘవేందర రావు.. వీళ్లందరూ తనతో ఎలా పని చేశారు? ఆమెను అన్‌ప్రొఫెషనల్ అని ఎలా అంటారు? అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా బాహుబలి రిలీజైన సమయంలో శ్రీదేవి డిమాండ్లపై పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకుగాను రూ.10 కోట్లు, 10 ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో ఓ అంతస్తు మొత్తం తనకే కావాలని శ్రీదేవి డిమాండ్ చేసిందని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కామెంట్స్ విని బాధపడ్డ శ్రీదేవి.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కి పైగా సినిమాలు చేశాను.
అలాంటి డిమాండ్లు చేసే ఈ స్థాయికి చేరాననుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండేదాన్నా? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నిర్మాతలే రాజమౌళికి ఇలా నాగురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు! కానీ, ఇలా పబ్లిక్‌గా మాట్లాడకపోయుంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేసింది. దీంతో రాజమౌళి సైతం పబ్లిక్‌గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడ్డాడు. కాగా శ్రీదేవి 2018లో మరణించింది. బాహుబలి విషయానికి వస్తే మొదటి భాగం 2015లో రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.
చదవండి: నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్