తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు(Bomb Threat ) కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్(Rajinikanth), ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి సోమవారం(అక్టోబర్ 27) సాయంత్రం ఓ ఈ మెయిల్ వచ్చింది. పోయస్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు.. కీల్పాక్కంలో ఉన్న టీఎన్ సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చివేస్తామని ఆ ఈమెయిల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ని రంగంలోకి దించి బెదిరింపులు వచ్చినవారి ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్ పంపినవారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 3న సీఎం స్టాలిన్తో పాటు హీరోయిన్ త్రిష, బీజేపీ కార్యాలయం, డీజీపీ ఆఫీసుకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్టోబర్ 13న కూడా సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.


