Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ స్టార్ట్.. శ్రీసత్యపై రేవంత్ ఫైర్!

బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. 21 మందిలో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు మేకర్స్.
‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఆ టాస్క్‌కి రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడు. స్నో మెన్ పార్ట్స్ దక్కించుకోవడానికి ఇంటి సభ్యులు బాగానే కష్టపడ్డారు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు తన సంపాధించిన స్నో మెన్ చేయి వేరే వాళ్లకి ఇచ్చేందుకు సిద్దమైంది.
చేయి ఎవరికైనా కావాలా అని సత్య అనగానే తనకివ్వమని ఫైమా అడుగుతుంది. అలా ఇచ్చుకోవడాలు లేవని సంచాలక్ గా ఉన్న రేవంత్ అడ్డుపడ్డాడు. అయినా వినకుండా ఎవరికైనా ఇస్తా అని సత్య మొండిగా అనేసరికి ఇచ్చుకోవడాలు లేవని రేవంత్ సీరియస్ గా చెప్పేశాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి ‘టికెట్ టు ఫినాలే’ అందుకుంటారో చూడాలి.