హీరోయిన్ భావన పెళ్లయిన కొత్తలో మలయాళ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్లపాటు (2018-2022) మాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సినిమా ఛాన్సులు ఇచ్చినా వాటిని నిర్మహమాటంగా తిరస్కరించింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఏదీ ప్లాన్ చేయలేదు
భావన మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేయలేదు. ఎందుకో సడన్‌గా మలయాళ సినిమాలకు దూరంగా ఉండాలనిపించింది. పెళ్లి చేసుకున్నాక నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. కుటుంబంతో సరదాగా గడిపాను. ఆ సమయంలో అలా ఉండటమే నాకు నచ్చింది. మాలీవుడ్‌కు వెళ్లి అక్కడ బిజీ నటిగా ఉండాలనిపించలేదు.

కథ వినకుండానే రిజెక్ట్ చేశా..
నా ఇష్టప్రకారమే సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సన్నిహితులు ఈ సినిమా చేయు, బాగుంటుంది.. ముందు కథ విను, నచ్చకపోతే నో చెప్పు అనేవారు. అయినా సరే కథ వినకుండానే చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను. కథ నచ్చాక కూడా నో చెప్పడం బాగోదనే అలా చేశాను. ఆషిఖ్ అబు, పృథ్వీరాజ్ సుకుమారన్, జయసూర్య, మమ్ముట్టి సినిమాలను సైతం తిరస్కరించాను. ఎందుకలా చేశావు? దీనివల్ల ఏం సాధిస్తావు? అని నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు.
సమాధానం లేదు
అప్పుడు నాకు మలయాళ సినిమాలకు విరామం ఇవ్వాలనిపించిందంతే! హ్యాపీగా బెంగళూరులో కుటుంబంతో గడపాలనుకున్నాను. ఈ లైఫ్‌స్టైల్‌ను బ్రేక్ చేసి మళ్లీ కేరళ వెళ్లిపోయి హడావుడిగా సినిమాలు చేయాలనుకోలేదు అని చెప్పుకొచ్చింది. భావన.. కన్నడ నిర్మాత నవీన్‌ను 2017లో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా 2018లో పెళ్లాడింది. పెళ్లయిన ఐదేళ్లపాటు మాలీవుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేసింది. కేవలం కన్నడ భాషలో మాత్రమే వరుసగా సినిమాలు చేసింది. ఇకపోతే భావన.. ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలతో తెలుగువారికి సైతం దగ్గరయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అనోమి ఫిబ్రవరి 6న విడుదలవుతోంది.


