
తల్లవాలంటే ముందు పెళ్లవాలా? అక్కర్లేదు, ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. ఓ శిశువును కోల్పోయింది.
టైం బాంబ్‌పై కూర్చున్నావ్
ఈ విషాదం గురించి భావన (Bhavana Ramanna) మాట్లాడుతూ.. సీమంతం తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. కొన్నిసార్లు స్పాటింగ్ (రక్తస్రావం) కనిపించేది. నేను వెళ్లే హాస్పిటల్ చాలా దూరంలో ఉండటంతో దగ్గర్లోనే మంచి డాక్టర్‌ను చూసుకుంటే అయిపోతుందన్నారు. మా బంధువులు ఎక్కువగా డెలివరీ అయిన డాక్టర్ దగ్గరకు వెళ్లి కలిశాను. ఆమె నన్ను చూడగానే.. భావన, నువ్వో టైం బాంబ్ మీద కూర్చున్నావ్.. తెలుసా? అంది.
పాప చనిపోయింది
వెంటనే నాకు అన్ని పరీక్షలు చేసింది. సాధారణంగా బొడ్డుతాడు ద్వారా శిశువుకు రక్తం అందుతుంది. కానీ టెస్ట్‌లో అది రివర్స్‌లో జరుగుతుందని తేలింది. అలాగే ఓ శిశువు గుండె కొట్టుకునే వేగం సగానికి సగం తగ్గిపోయిందని తెలిసింది. పైగా సరైన బరువు కూడా లేదని డాక్టర్ చెప్పింది. అప్పటికప్పుడు నాకు ఆపరేషన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒక బిడ్డ చనిపోయిందని చెప్పగానే నాకు మాటలు రాలేదు.
అమ్మమ్మ పేరే పెట్టా..
పుట్టిన బిడ్డ కోసం సంతోషపడాలా? చనిపోయిన పాప కోసం ఏడవాలా? ఏదీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. నా కూతురికి రుక్మిణి అని మా అమ్మమ్మ పేరు పెట్టాను. తను ఆగస్టు 20న జన్మించింది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది.
చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!