స్వతహాగా ఉత్తరాదికి చెందిన భామనే అయినప్పటికీ తెలుగులో వరస సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటివరకు ప్రముఖ హీరో, నిర్మాణ సంస్థలతోనే పనిచేసింది. రవితేజ 'మిస్టర్ బచ్చన్' ఈమెకు తొలి తెలుగు చిత్రం కాగా చివరగా రామ్ 'ఆంధ్రా కింగా తాలుకా'లో కనిపించింది. ఇప్పుడు తమిళంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. శివకార్తికేయన్‌తో కలిసి 'సెయాన్'లో నటిస్తోంది. దీని షూటింగ్ మొదలైన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న 'సెయాన్' చిత్రానిక 'తాయ్ కిళవి' ఫేమ్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న భాగ్యశ్రీ.. కమలహాసన్‌ని నేరుగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. అనంతరం సోషల్ మీడియాలో కమలహాసన్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. ఎంతో అభిమానం కలిగిన కమలహాసన్ సర్, మీ ఎదుగుదలని చూస్తూ పెరిగాను. అలా నా మనసులో ఉన్న మీరు ఇప్పుడు నా భుజంపై చేయి వేసి శుభాకాంక్షలు అందించిన క్షణాన కలిగిన ఆనందంలో తేలియాడుతున్నా. రాజ్‌కమల్ సంస్థలో నటించడం ఘనతగా భావిస్తున్నాను. మిమ్మల్ని గర్వపరచే విధంగా నేను పని చేస్తాను' అని భాగ్యశ్రీ రాసుకొచ్చింది.
ఈమె తెలుగులో అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది.


