
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్‌విజయ్, రాజ్‌కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు.
అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్‌ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్‌స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు.