కళాకాంతులు.. వారి హృదయానికి కళ్లున్నాయి..

Babita Saroj, Hemendra: Have eyes to their heart - Sakshi

వెండితెర, బుల్లితెరపై అంధపాత్రలు ధరించి ఎంతోమంది నటీనటులు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం మనకు తెలిసిందే! మరి ఏ భావోద్వేగాలు పలికించలేరనుకునే అంధులే నటిస్తే... ‘అలాంటి వారు కూడా ఉన్నారా!’ అనే ఆశ్చర్యానికి సమాధానంగా బబిత, హేమేంద్రలు అంధ కళాకారులుగా రాణిస్తున్నారు.

ప్రపంచంలో అందమైన దృశ్యాన్ని చూడటానికి వారికి కళ్లు లేవు. అయితేనేం, వారి కళా నైపుణ్యం కారణంగా ప్రపంచమే ఇప్పుడు వారివైపు చూస్తోంది. అంధులైనప్పటికీ రంగుల తెరపై తమదైన ముద్ర వేస్తున్న వీరి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే!

నా దారిని నేను వెతుక్కోగలను..
ముంబైలో ఉంటున్న 24 ఏళ్ల బబిత సరోజ్‌ మరాఠీ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘ద్రిశాంత్‌’లో నటిస్తోంది. దుఃఖం, గాంభీర్యం, కోపం.. ఈ భావాలను పలికించడానికి భయం అక్కర్లేదు. ఏదైనా చేయాలనే తపన, క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టు వీడకుండా ప్రతి ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకోగలరనే నమ్మకం ఉంటే చాలని తాను ఎన్నుకున్న దారి ద్వారా సమాధానం చెబుతుంది బబిత. ‘ఇదెలా సాధ్యం..?’ అని అడిగిన వారిపై ‘అంధులు తమంతట తాముగా ఏమీ చేయలేరని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరని అనుకుంటారు. ఆలోచించే మెదడు, మాట్లాడే నాలుక ఉన్నప్పుడు ఎవరి సాయం లేకుండానే నడవగలను. నా ఆలోచనా శక్తితో నా దారిని నేను వెతుక్కోగలను. అలాంటప్పుడు నేను ఎందుకు నటించలేను’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.

త్వరలో విడుదల కానున్న దృష్ట్‌ సినిమా షూటింగ్‌ సన్నివేశంలో  బబిత

బబిత తన గురించి మరిన్ని వివరాలు చెబుతూ –‘2009లో అనారోగ్యం కారణంగా నా కంటి చూపును కోల్పోయాను. కానీ, నటనపై ఉన్న ఇష్టం నా మనస్సులో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మూడేళ్లకు నా జీవితానికి ఆధారమైన నాన్న దూరమయ్యారు. దీంతో నా చిన్న అవసరాలు కూడా తీర్చుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నాను. కానీ, ఒక రోజు నా పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే బతకలేను అని అర్ధమైంది. ఈ ఆలోచన నా మార్గం నన్ను చూసుకునేలా చేసింది. స్నేహితులు, తెలిసిన వారి ద్వారా చాలా టీవీ సీరియల్స్, సినిమాలకు ఆడిషన్స్‌ ఇచ్చాను. రోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. చివరికి ఓ రోజు నా కష్టానికి ఫలితం దక్కింది.

మరాఠీ బుల్లితెరపై నడిచే సీరియల్, షార్ట్‌ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. షూటింగ్‌ సమయంలో అడుగుల లెక్కింపుతో కెమెరాను సమన్వయం చేసుకుంటాను. ఇది కష్టమైనప్పటికీ కొన్ని రోజుల సాధనతో సాధించగలిగాను. దర్శకుడు చెప్పిన దాని ప్రకారం నా పని నేను పూర్తి చేస్తాను. సెట్స్‌లో అంధురాలిగా అస్సలు భావించను. ఎలాంటి పాత్ర చేసినా ముందుగా నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దానిని దాచడం వల్ల ప్రయోజనం లేదు, దానిని బహిర్గతం చేసి అధిగమించడమే మనముందున్న సవాల్‌. నాకు కావల్సింది నేను పొందాలనుకున్నప్పుడు వెనుకంజ వేసేది లేదు అని ఆత్మవిశ్వాసంతో చెప్పే బబిత న టించిన ‘దృష్ట్‌’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.

చీకటిని తొలగించే మార్గం...
వారణాసిలో ఉంటున్న 25 ఏళ్ల హేమేంద్ర తన మనసులోని చీకటిని తొలగించే మార్గాన్ని కనుక్కొన్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓటీటీ ఫిల్మ్‌ ‘మిస్టరీ థ్రిల్లర్‌ బ్రీత్‌ ఇన్‌ టు ది షాడోస్‌’ మూడవ సీజన్‌లో హేమేంద్ర సైబర్‌ క్రైమ్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ‘అంధాధున్‌’ సినిమా సమయం లో నటుడు ఆయుష్మాన్‌ ఖురానాకు దృష్టిలోపం ఉన్నవారు ఎలా జీవిస్తారో హేమేంద్ర స్వయంగా నేర్పించాడు. అదే సమయంలో ‘శుభో బిజోయ్‌’ చిత్రానికి నటుడు గుర్మీత్‌చౌదరి అంధుడి పాత్రకు హేమేంద్ర నుంచే శిక్షణ తీసుకున్నాడు.

17 ఏళ్ల వయసులో ఆప్టిక్‌ న్యూరైటిస్‌ అనే వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయిన హేమేంద్ర ‘ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. అయితే, నేను ఎందుకు రాణించలేను అని నాకు నేను ప్రశ్న వేసుకుని ఆ తర్వాత నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అని తెలియజేస్తాడు. ‘చూపు కోల్పోవడంతో నా కలలన్నీ కల్లలయ్యాయి. ఈ షాక్‌ని భరించడం చాలా కష్టమైంది. కానీ, నా కుటుంబ సభ్యులు మాత్రం నాలో ధైర్యాన్ని నింపారు. నా భవిష్యత్తును నేను ప్రకాశవంతం చేసుకోవాలనుకున్నాను. అందుకోసం కష్టపడటం మొదలుపెê్టను.

ఈ ప్రయత్నంలో భాగంగా ముంబైలో దృష్టిలోపం ఉన్నవారికోసం పనిచేస్తున్న ఒక సంస్థను కలిశాను. అక్కడ అంధులైన పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. అటు తర్వాత పరిచయమైనవారి ద్వారా కళారంగంవైపుగా అడుగులు వేశాను. షూటింగ్‌ సమయంలో కెమరాను ఫేస్‌ చేయడం చాలా కష్టం. అయితే, యాక్టింగ్, ఎమోషన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కొన్నిసార్లు అడవి, సముద్రం వంటి ప్రదేశాల్లోనూ షూటింగ్స్‌ జరుగుతాయి. అలాంటి చోట అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో నేను నా చుట్టూ ఒక సర్కిల్‌ గీసుకొని, దానిలోపలే ఉంటూ పని పూర్తిచేస్తుంటాను’ అని వివరిస్తాడు హేమేంద్ర.

సాధించాలనే తపనకు అవయవలోపం అడ్డంకి కానేకాదు అని నిరూపిస్తున్న ఈ యువ కళాకారులు  ‘మేమూ సాధించగలం’ అనే స్ఫూర్తిని తమలాంటి వారెందరిలోనూ నింపుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top