
సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతున్నారో అర్థం కావట్లేదు. కొందరు ఫేమస్ అవుతుంటే.. మరికొందరు ఊహించని విధంగా బుక్కైపోతున్నారు. తాజాగా లండన్లో ఓ కంపెనీ సీఈవో అండ్ హెచ్ఆర్ చీఫ్ ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరయ్యారు. వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట తెగ వైరలైంది. దీంతో ఆ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాతో ఫేమస్ అవ్వడం మాత్రమే కాదు.. ఉద్యోగం కూడా ఊడుతుందన్న సంగతి తెలిసొచ్చింది.
అయితే ఈ సీన్తో లింక్ చేస్తూ బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. మాహిస్మతి రాజ్యానికి సీఈవో అండ్ హెచ్ఆర్ అంటూ ప్రభాస్, అనుష్క పోస్టర్ను పోస్ట్ చేసింది. ఇందులో ప్రభాస్- అనుష్క అచ్చం కోల్డ్ ప్లే కన్సర్ట్లో చేసిన స్టైల్లోనే ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కోల్డ్‌ప్లే కన్సర్ట్ వర్సెస్ భల్లాలదేవా కన్సర్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కెమెరామెన్ కట్టప్ప అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అసలేం జరిగిందంటే..
ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ లో తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్ కావడంతో ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ కంపెనీలో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్‌ను కౌగిలించుకుని మసాచూసెట్స్ స్టేట్ బోస్టన్‌లోని గిల్లెట్ స్టేడియంలో వీళ్లిద్దరు కెమెరాలకు చిక్కారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్ ‘‘వారు అఫైర్‌లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్ చేయడంతో అది మరింత వైరల్గా మారింది.
ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్‌లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది.
కాగా.. క్రిస్ట్రిన్ క్యాబెట్‌కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్‌కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి.