ఓటీటీల్లో మలయాళ సినిమాలనే ఎందుకు ఎక్కువగా చూస్తారు? అంటే సమాధానం చాలా సింపుల్. కథలు, పాత్రలు సహజంగా ఉంటాయి. మంచి థ్రిల్ ఇస్తాయి లేదంటే ఫుల్ కామెడీ అనిపిస్తాయి. కొన్నిసార్లయితే ఇలాంటి ఓ పాయింట్‌తోనూ సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపరుస్తాయి. అలా ఇప్పుడు 'అక్రమ సంబంధం' అనే సీరియస్ అంశంపై పూర్తి కామెడీగా ఓ మూవీ తీశారు. అదే 'అవిహితం'. రీసెంట్‌గా ఇది హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ఓ పల్లెటూరు. ప్రకాశ్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో మందు పార్టీ చేసుకుని ఇంటికి తిరిగొస్తుంటాడు. ఓ చోట అలికిడి అయ్యేసరికి అటువెపు వెళ్తాడు. ఆ చీకటిలో వినోద్ అనే కుర్రాడు.. మరో యువతితో కలుసుకోవడం చూస్తాడు. పక్కనే నిర్మల ఇల్లు ఉండేసరికి చీకటిలో ఉన్నది ఆమెనే అనుకుంటాడు. తర్వాత ఈ విషయాన్ని వేణు అనే వ్యక్తికి చెబుతాడు. అలా ఒకరి నుంచి ఒకరికి చాలామందికి దీని గురించి తెలుస్తుంది. చివరకు ఈ సంగతి.. నిర్మల భర్త ముకుందన్ వరకు చేరుతుంది. ఇంతకీ చీకటిలో కనిపిస్తున్న యువతి ఎవరు? వినోద్-నిర్మల విషయంలో అందరి అనుమానం నిజమైందా? చివరకు అందరూ కలిసి ఏం చేశారనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
సిటీలో తక్కువ గానీ గ్రామాల్లో గాపిస్ కల్చర్ ఎక్కువే. ఏదైనా ఓ విషయం జరగ్గానే అమ్మలక్కలు చేరిపోయి ముచ్చట్లు పెడతారు. చేయాల్సిన పనులన్నీ గాలికొదిలేసి సదరు పుకార్ల గురించే తెగ మాట్లాడుకుంటారు. ఈ సినిమా కూడా సేమ్ అలాంటి ఓ పాయింట్‌తోనే తీశారు. రాత్రిపూట చీకటిలో ఓ యువతీ యువకుడు కలుసుకోవడం ముందు ఒకడు చూస్తాడు. అది ఇంకోకడికి చెబుతాడు. ఈ ఇద్దరు మరో ఇద్దరికి చెబుతారు. అలా ఇదో పెద్ద డిస్కషన్ అయిపోతుంది.
సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే 'అక్రమ సంబంధం' అనే అసలు పాయింట్ రివీల్ అవుతుంది. చీకటిలో కనిపించిన అమ్మాయి ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. కానీ పక్కనోడు చెప్పాడని, పరిస్థితులు సింక్ అవుతున్నాయని 'ఆమె'నే అని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఎలాగైనా సరే ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. రాత్రయితే చాలు ఈ విషయం తెలిసిన ఒక్కడూ నిద్రపోడు. చీకటిలో వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్. దానికి తోడు ఓ మెసేజ్. సందేశం కదా అని స్పీచుల్లాంటివి ఉంటాయని అనుకోవద్దు. సింపుల్‌గా రెండు మూడు సీన్లతోనే చాలామంది భర్తలకు కళ్లు తెరిపించే మెసేజ్ ఇచ్చారు.
డార్క్ కామెడీ జానర్ కావడంతో అడల్ట్ టచ్ జోక్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ గీత దాటకుండా ఉంటాయి. ఇవి అర్థమైతే మాత్రం ఫుల్‌గా నవ్వుకుంటారు. చూస్తున్నంతసేపు మంచి టైమ్ పాస్ అవుతుంది. సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పల్లె వాతావరణంలో చాలా సహజంగా ఉంటుంది. ఇదేదో మన ఊరిలో జరుగుతుందా అనిపిస్తుంది. యాక్టర్స్ ఎవరో గానీ పాత్రల్లో జీవించేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వన్ లైనర్స్ భలే పేలాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి ఓ పాయింట్‌తోనూ సినిమాని తీయొచ్చు. ప్రేక్షకుల్ని అలరించొచ్చని ఇది చూశాకే అర్థమైంది.
-చందు డొంకాన


