
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: ‘మా మామ గారు అక్కినేని నాగేశ్వర్‌రావు చివరి వరకూ శ్రమిస్తూనే ఉన్నారు. కేన్సర్‌తో బాధపడుతూనే ‘మనం’ సినిమాకు పనిచేశారు. చివరి దశలో హాస్పిటల్ బెడ్‌పైనుంచే ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆశీర్వాదంతో తాను ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపానని, మీరు విచారించాల్సిన అవసరం లేదని ఆయన మా అందరికీ చెప్పేవారు’ అని మామయ్య అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకుంటూ అక్కినేని అమల ఎమోషనల్ అయ్యారు.
కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ కేన్సర్ అవగాహన పరుగు పోస్టర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం, పర్యావరణాన్ని ప్రేమించకపోవడం.. అన్నింటినీ నిర్లక్ష్యం చేయడమే కేన్సర్ విజృంభణకు కారణాలన్నారు.
కలుపు మందులు, పురుగుమందులు చాలా వరకు కేన్సర్‌కు కారణమవుతాయని తెలిసినా వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రేస్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, గ్లోబల్ రేస్ డెరైక్టర్ నిరంజన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.