
స్టార్ హీరో అజిత్‌కి జోడీగా శ్రీనిధీ శెట్టి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు శ్రీనిధీ శెట్టి. ఆ సినిమాపాన్ ఇండియా హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, తమిళ చిత్రం ‘కోబ్రా’ మంచి విజయాలు సాధించాయి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు శ్రీనిధి.
ఈ చిత్రంలో తనదైన నటన, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... అజిత్ కుమార్‌తో నటించే క్రేజీ చాన్స్‌ను శ్రీనిధి అందుకున్నట్లు టాక్. అజిత్ నటిస్తున్న 64వ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.
అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ‘ఏకే 64’ (వర్కింగ్ టైటిల్)కి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నవంబరులో ఆరంభం అవుతుందట. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... అజిత్‌కి జోడీగా శ్రీనిధి నటిస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.