
స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అదితి శంకర్ అనే విషయం తెలిసిందే. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకిగా, గాయనిగా ఒకేసారి పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌కి జంటగా మావీరన్ చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆకాష్ మురళి హీరోగా పరిచయమైన తమిళ చిత్రం నేశిప్పాయాలో అదితిశంకర్ నాయకిగా నటించారు. ఆ చిత్రం నిరాశపరిచింది. అదేవిధంగా తెలుగులో ఈమె ఎంట్రీ ఇచ్చిన భైరవం చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
దీంతో కాస్త వెనకపడ్డ అదితి ప్రస్తుతం అర్జున్‌దాస్‌కు జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే తాజాగా మరో అవకాశం ఆమెకు తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈరం, కుట్రం 23 వంటి థ్రిల్లర్ కథా చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అరివళగన్. తాజాగా తెరకెక్కించనున్న చిత్రంలో అదితిశంకర్‌ను కథానాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.
అరివళగన్ దర్శకుడు శంకర్ శిష్యుడు అన్నది గమనార్హం. దీంతో ఈయన తన గురువుగారి వారసురాలుని తెరపై ఏ విధంగా ఆవిష్కరించనున్నారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే నెలకొంటోంది. ఎందుకంటే అదితిశంకర్ ఇప్పటివరకు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటించలేదు.