
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

పెద్దిలో పవర్‌ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అంతే రేంజ్‌లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్ నటి విజి చంద్రశేఖర్‌ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్‌గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటిస్తుందని టాక్ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.