
సినీరంగంలో సెలబ్రిటీస్ పెళ్లి పెద్ద వార్త అయితే విడిపోవడం కూడా పెద్ద వార్తగా మారుతోంది. ఇటీవల ధనుష్, రవిమోహన్ వారి సంసార జీవితం విడాకులకు దారి తీయడం పెద్ద సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇలా మరికొన్ని సినీ జంటల్లో విడిపోయిన వారు ఉన్నారు. కాగా తాజాగా మరో సినీ జంట ఈమధ్య ఏర్పడ్డ అభిప్రాయభేదాలు విడాకుల వైపు దారితీస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ జంటే ఫరెవర్ బహుభాషా నటి సంగీత, గాయకుడు, నటుడు క్రిష్.
తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా పేరుగాంచిన నటి సంగీత. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మలయాళ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించిన సంగీత ఆ తర్వాత కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో నటించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్ సరసన నటించిన పితామగన్ చిత్రం సంగీతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలా కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే 2009లో గాయకుడు క్రిష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒక కూతురు కూడా ఉంది. ప్రస్తుతం 46 ఏళ్ల సంగీత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. కాగా పదహారేళ్లు సాఫీగా, సుఖసంతోషాలతో సాగిన వీరి వివాహ జీవితంలో ఇప్పుడు ముసలం పుట్టిందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మనస్పర్థల కారణంగా సంగీత, క్రిష్ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇన్‌స్టాలో పేరు మార్పు
సంగీత తన ఇన్‌స్టా ఖాతాలో పేరు మార్చడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లైయింది. గతంలో ఇన్‌స్టాలో సంగీత క్రిష్ అని ఉండేది. కానీ ఇప్పుడు సంగీత యాక్ట్‌గా బయో మారింది. దీంతో వీరి మధ్య నిజంగానే మనస్పర్థలు వచ్చాయంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విడాకుల ప్రచారంలో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై సంగీతగానీ, క్రిష్‌గానీ స్పందిస్తే గాని నిజం బయటపడే అవకాశం ఉంది.
సంగీత సినీ కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ టాలెంటెడ్ నటి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మహేశ్ బాబుకు అత్త పాత్ర.. రష్మిక మందన్నాకు తల్లిగా సంగీత నవ్వులు పూయించింది. ఆ తర్వాత మసూద తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.