హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.. గత నెలలో మరోసారి తల్లయింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ చిన్నారి నూలేకెట్టి వేడుకని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ.. తన కూతురు ఫొటోలని తొలిసారి పంచుకుని, ఆమెకు పెట్టిన పేరు గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)
'జమీలా అనేది నా అమ్మమ్మ పేరు. చిన్నప్పుడే కోల్పోయిన ఆమె జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గనక కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా కుమార్తెని ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం.. అమ్మమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. పాప పుట్టడం మా కుటంబానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చింది' అని పూర్ణ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
పాప పుట్టన తర్వాత 28వ రోజున నూలేకెట్టి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారమని.. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారని.. హమ్దాన్ పెద్ద అన్నయ్యగా మారి కుటుంబంలో కొత్త బాధ్యతను స్వీకరించాడని పూర్ణ చెప్పుకొచ్చింది. 'దువా జమీలా'కి కుటుంబం ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాసుకొచ్చింది.
కేరళకు చెందిన ఈమె.. సీమటపాకాయ్, అవును తదితర సినిమాలతో తెలుగులో గుర్తింపు సాధించింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మూవీస్ చేసింది. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ, టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చివరగా 'అఖండ 2'లో కనిపించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టగా, ఇప్పుడు పాప జన్మించింది.
(ఇదీ చదవండి: 'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో)


