‘‘సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. నేను మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారిలో ఏర్పడింది. ‘డెకాయిట్’లో చేసిన సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మృణాల్ ఠాకూర్ చెప్పిన విశేషాలు.
⇒ ‘డెకాయిట్’ ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీ మూవీ. ఈ చిత్రంలో నేను సరస్వతి పాత్రలో, హరి పాత్రలో శేష్ నటించాం. హరి, సరస్వతి ఎందుకు డెకాయిట్స్‌గా మారారనేది సినిమాలో చూడాలి. సరస్వతి క్యారెక్టర్ నాకో సవాల్. ఈ సినిమా కోసం కొన్ని స్టంట్, చేజింగ్, డ్రైవింగ్ సన్నివేశాలు చేశాను. అంబులెన్స్ కూడా నడిపాను. చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్‌కు హ్యాండ్ బ్రేక్ లేదు. ఇలాంటి రిస్కీ సీన్స్ కూడా చేశాను.
⇒ ‘సీతారామం, హాయ్.. నాన్న, ఫ్యామిలీ స్టార్’లను తెలుగులోనే తీశాం. కానీ ‘డెకాయిట్’ను తెలుగు, హిందీ భాషల్లో చేశాం. నాకైతే తక్కువ రెమ్యునరేషన్‌తో రెండు సినిమాలు చేసిన ఫీలింగ్ కలిగింది (సరదాగా). ఈ సినిమాలో ఓ సీన్‌లో బురదలో నటించాల్సి వచ్చింది. కానీ మేకర్స్ నా ఫేస్ గురించి ఆలోచించి బురద బదులు చాక్లెట్‌ను ప్లాన్ చేశారు. ఇలా చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. షానియల్‌గారు అద్భుతమైన డైరెక్టర్. ఓ మంచి సినిమా చేసిన ఫీలింగ్ నాకు ఉంది.


