
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ భామ టీవీ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినీ రంగప్రవేశం చేసింది. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించి ఆపై హిందీ చిత్రాల్లో నటిస్తుండగా టాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది. అలా సీతారామం అనే తెలుగు చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించి పాపులర్ అయింది. హాయ్ నాన్నతో మరింత స్టార్‌డమ్ అందుకుంది. కానీ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని పెద్దగా ఆదరణ పొందలేవు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో లక్కీచాన్స్ వరించినట్లు సమాచారం.

పాన్ ఇండియా మూవీలో..
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో మృణాల్‌ఠాకూర్ ఒక కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు శివకార్తికేయన్‌కు జంటగా మదరాశి చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని ఆమె చేజార్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఈ అమ్మడికి రాలేదు. ఇకపోతే హీరోయిన్‌గా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ చేతినిండా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్న ఈ బ్యూటీ ఖర్చు చేయడంలో మాత్రం మహా పొదుపరి!
అంతకంటే ఎక్కువ పెట్టను
దీనిపై మృణాల్ ఇటీవల చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తనకు ఖరీదైన దుస్తులు కొనడం ఇష్టం ఉండదని, ఎంతో డబ్బులు పోసిన కొన్నప్పటికీ అవి బీరువా అరల్లో మూలుగుతుంటాయంది. తాను కొనుగోలు చేసిన దుస్తుల ఖరీదు అత్యధికంగా రూ.2వేలు దాటి ఉండవన్నారు. అయితే సినీ కార్యక్రమాలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం లక్షల ఖరీదైన దుస్తులు ధరిస్తానని, అయితే అవన్ని సొంతం కాదని, అద్దెకు తెచ్చుకునేవేనని మృణాల్ తెలిపింది.