
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధానపాత్ర చేశారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ– ‘‘1980–1990లలో జరిగే కథ ‘ఓజీ’.
ఈ చిత్రంలో ఓజాస్ గంభీరపాత్రలో పవన్‌గారు, కణ్మణిగా నేను నటించాం. గంభీర జీవితాన్ని మలుపు తిప్పేపాత్ర కణ్మణిది. కథ, అందులోని నాపాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాను. ఈ సినిమా కథ, కణ్మణిపాత్ర నచ్చినందుకే ఒప్పుకున్నాను... పవన్‌కల్యాణ్‌గారు హీరో అని కాదు. ఇమ్రాన్ హష్మితో నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఇక ధనుష్‌గారి డైరెక్షన్‌లోని ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’లో ‘గోల్డెన్ స్పారో’ అనే స్పెషల్ సాంగ్ చేశాను. జస్ట్ ఒక్క రోజులో ఈపాట పూర్తయింది. తెలుగులో కథలు వింటున్నాను.
ఇతర భాషల్లో కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. రజనీకాంత్‌గారి ‘జైలర్ 2’ సినిమాలో నటించలేదు. అవకాశం వస్తే చేయాలని ఉంది. ఈ మధ్య కొంతమంది దర్శక–నిర్మాతలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీస్తున్నారు. ఇందుకు హ్యాపీగా ఉంది. నాకు కామెడీపాత్రలూ చేయాలని ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సోషల్ మీడియాలో నా హ్యాండిల్స్‌ను నా టీమ్ చూసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. నా ఫొటోలు షేర్ చేయడానికి సోషల్ మీడియాను వినియోగించుకుంటాను... అంతే. పెయిడ్ నెగటివ్ క్యాంపైన్స్ ఉంటాయని విన్నాను.
ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాక్సాఫీస్ నంబర్స్‌ను పట్టించుకోను. ఒకప్పుడు సినిమా బాగుందా? లేదా అని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఫలానా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఫలానా సినిమా అంత కలెక్ట్ చేసిందని చెప్పుకుంటున్నాం. కొందరు ఫేక్ కలెక్షన్స్ చూపించి, సినిమా సూపర్ హిట్ అని చెబుతుంటారు. కానీ సినిమాలో సరైన కంటెంట్, క్వాలిటీ ఉండవు. మనీ గురించి మాట్లాడుతూ సినిమా సోల్‌ను మర్చిపోతున్నాం’’ అన్నారు.