
హీరోయిన్ మహేశ్వరి (Actress Maheswari) గుర్తుందా? ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఇటీవల ఆమె జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా ఓ హీరోపై తనకున్న క్రష్‌ను బయటపెట్టింది. మహేశ్వరి మాట్లాడుతూ.. 'హీరో అజిత్ కుమార్ అంటే నాకు క్రష్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. తనతో రెండు సినిమాలు చేశాను.
షూటింగ్ చివరి రోజు..
ఓ మూవీ షూటింగ్ సాగదీయడం వల్ల ఏడాదిన్నర పాటు తనతో కలిసి పని చేశాను. అంతా అయ్యాక షూటింగ్ చివరి రోజు ఊహించనిది జరిగింది. అసలే ఆయన్ను మళ్లీ కలవలేనని బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో అజిత్ నా దగ్గరకు వచ్చి మహి, నువ్వు నా చెల్లెలిలాంటిదానివి. నీ జీవితంలో ఎప్పుడు, ఏం అవసరమొచ్చినా దయచేసి నన్ను అడుగు.. నేను నీకోసం ఉన్నాను అని చెప్పాడు. అలా నా క్రష్ నన్ను చెల్లి అని పిలిచాడు' అని గుర్తు చేసుకుంది.
సినిమా
మహేశ్వరి.. 1994లో కరుత్తమ్మ సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. గులాబి సినిమాతో సెన్సేషన్ అయింది. దెయ్యం, పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ.. ఇలా అనేక సినిమాలు చేసింది. అజిత్‌తో ఉల్లాసం, నేశం సినిమాల్లో నటించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొంతకాలం పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఆమె ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తోంది.