ప్రియుడి చేతిలో నరకం చూశానంటోంది మలయాళ బుల్లితెర నటి జసీలా పర్వీణ్ (Jaseela Parveen). కొత్త ఏడాది సెలబ్రేషన్స్ రోజు తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడంది. రక్తం వచ్చేలా కొట్టాడంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాకేం జరిగిందో మీకు తెలియాలనుకుంటున్నాను. సింపతీ కోసం ఇదంతా చేయడం లేదు. నాకు మీ సపోర్ట్ కావాలి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలో కాస్త మీరే చెప్పండి.
నేలకేసి కొట్టాడు
డాన్ థామస్‌కి మందు తాగే అలవాటు, అలాగే సిగరెట్ కూడా తాగుతాడు. తన ప్రవర్తన కూడా సరిగా ఉండదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ రోజు ఇదే విషయంపై ఇద్దరికీ గొడవ జరిగింది. క్షణాల్లోనే అతడు రాక్షసుడిగా మారిపోయాడు. నన్ను కడుపులో తన్నాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. నా తల నేలకేసి కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఎక్కడపడితే అక్కడ మృగంలా కొరికాడు. చేతికి దొరికిన వస్తువుతో నా ముఖంపై కొట్టాడు.

మాజీ ప్రియుడితో జసీలా పర్వీణ్
చాలా రక్తం పోయింది
దీంతో నా పై పదవి చిట్లిపోయి రక్తం కారింది. నన్ను చాలాసేపు చితకబాదాడు. చాలా రక్తం పోయింది. నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లమని వేడుకున్నాను, కానీ వినలేదు. పోలీసులకు సమాచారమివ్వడానికి ప్రయత్నించగా నా ఫోన్ లాక్కున్నాడు. తర్వాత కాసేపటికి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. మెట్లపై నుంచి పడిపోయానని అబద్ధం చెప్పాడు. అతడు చేసిన పనికి నేను నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత జరిగినా కాస్తంతయినా పశ్చాత్తాపపడలేదు.
చిన్న గాయాలు కావు
నన్ను వేధిస్తూనే ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఇలాంటి వ్యక్తిని సహించేది లేదని నిర్ణయించుకున్నా.. జనవరి 14న పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ, వాళ్లు వెంటనే స్పందించలేదు. ఇప్పుడైతే కేసు నడుస్తోంది. నాకు అయిన గాయాలు చిన్నవి కావు, అవి నిరూపించేందుకు నా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. లాయర్‌ను పెట్టుకునేంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే కోర్టుకు నేనొక్కదాన్నే వెళ్లి వస్తున్నాను. కోర్టులో నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.
న్యాయం కోసం పోరాడతా..
ఆర్టిస్టుగా నా ముఖం నాకెంతో ముఖ్యం. నా ఫేస్ పాడుచేసిన కారణంగా నెలలపాటు పని చేయలేకపోయా.. ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనతో నరకం అనుభవించాను. అతడు మాత్రం ఓ సీనియర్ లాయర్‌ను పెట్టుకుని కేసును ఆలస్యం చేస్తూ పోతున్నాడు. నేను ఇంకా మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. నాకు న్యాయం కావాలి. న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాను. దయచేసి ఇప్పుడు నేనేం చేయాలో ఎవరైనా లాయర్స్ సలహా ఇవ్వండి అని రాసుకొచ్చింది. జసీలా.. ఆగస్టు 27, పెట్ డిటెక్టివ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.
చదవండి: హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్


