
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) డ్రెస్సింగ్‌పై ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. తాను వేసుకునే బట్టలు, వయసు గురించి ప్రశ్నిస్తూ బాడీ షేమింగ్ చేశాడని, అవమానించాడంటూ మంచు లక్ష్మి ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించింది. తన ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రశ్నించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
చదువురాని వాళ్లంటే ఏదో అనుకోవచ్చు
ఈ విషయంలో సీనియర్ నటి హేమ (Actress Hema).. మంచు లక్ష్మికి సపోర్ట్ చేసింది. మీడియా వల్ల బాధపడ్డవారిలో నేనూ ఒకర్ని. పెద్దగా చదువుకోని నాలాంటివాళ్లు ఏదైనా తెలియక మాట్లాడి ఉండొచ్చేమో! కానీ బాగా చదువుకున్న కొందరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఇలా ఏదిపడితే అది మాట్లాడినప్పుడు మీ అసోసియేషన్‌లో ఉన్న వేరే ఎవరూ మాట్లాడరా?
మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి
నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? మంచు లక్ష్మిని ఓ యాంకర్ బాడీ షేమింగ్ చేశాడు. మా అసోసియేషన్ ఏం చేస్తోంది? మా ప్రెసిడెంట్ అక్కకే ఇలాంటి గతి అంటే.. మిగతావాళ్ల పరిస్థితి ఏంటి? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఎందుకింతవరకు స్పందించలేదు? విష్ణుబాబు, ఏం చేస్తున్నావ్. ఈరోజు నీ అక్కకు, రేపు ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ అన్నది మాలాంటి ఆర్టిస్టులను కాపాడుకోవడానికే కదా!
సారీ చెప్పించారు
గతంలో వేణుస్వామి.. సమంత, నాగచైతన్య గురించి ఏదో అంటే జర్నలిస్టులు కంప్లైంట్ చేసి ఆయన క్షమాపణలు చెప్పేదాకా ఊరుకోలేదు. తర్వాత సుమతో కూడా సారీ చెప్పించారు. మరిప్పుడు ఆ వ్యక్తి పిచ్చి ప్రశ్నలతో నటిని అవమానించినప్పుడు మా అసోసియేషన్ పట్టించుకోదా? దయచేసి స్పందించు విష్ణు బాబు' అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.