
∙భర్త జావేద్‌తో డ్యాన్స్ చేస్తున్న షబానా
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ ఎంతో ఉత్సాహంగా ‘ప్రెట్టీ లిటిల్ బేబీ’ పాటకు డ్యాన్స్ చేశారు. 75 ఏళ్ల వయసులో ఆమె ‘లిటిల్ బేబీ’ అంటూ డ్యాన్స్ చేయడానికి కారణం ఉంది. గురువారం (సెప్టెంబరు 18) షబానా 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసి, పలువురు బాలీవుడ్ స్టార్స్‌ని ఆహ్వానించారు. అమెరికన్ సింగర్ కోనీ ఫ్రాన్సిస్ ఫేమస్ పాట ‘ప్రెట్టీ లిటిల్ బేబీ’కి భర్త జావేద్ అక్తర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు షబానా.
ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ నైట్ పార్టీలో డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ‘పరిణీత’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘కైసీ పహేలీ జిందగాని’కి డ్యాన్స్ చేసి, ఆకట్టుకున్నారు. మాధురీతో కలిసి సీనియర్ నటి రేఖ స్టయిల్‌గా వేసిన స్టెప్పులు అందర్నీ అలరించాయి. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, ఊర్మిళ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలూæ వైరల్ అయ్యాయి.
‘ఓజీ క్వీన్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను నటుడు–నిర్మాత సంజయ్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకా ‘జిందగీ న మిలేగీ దోబారా’ చిత్రంలోని ‘సెనోరిటా’ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు దర్శక–నిర్మాత–నటుడు ఫర్హాన్ అక్తర్. ఈ వేడుకలో హృతిక్ రోషన్, సోనూ నిగమ్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.