
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో.. వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు పొన్నాంబళం. చిరంజీవి 'ఘరానా మొగుడు' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎవరైతే లక్ష రూపాయలిస్తారో వాళ్లతోనే సోలో ఫైట్ చేస్తానని సవాల్ విసిరాడు. ఫైట్ బాగా వస్తేనే డబ్బులివ్వమన్నాడు. ఘరానా మొగుడు షూటింగ్‌లో అతడి పర్ఫామెన్స్ మెచ్చి రూ.1 లక్ష ఇచ్చారు.
నాలుగేళ్లుగా నరకం
అంతేకాదు, చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించి మరీ అతడికి రూ.5 లక్షలు బహుమతిగా ఇచ్చారు. అలా అప్పటినుంచే చిరంజీవి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. తమ్ముడు విషప్రయోగం వల్ల పొన్నాంబళం రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో ఉన్నప్పుడు చిరంజీవి సాయం చేశారు. దాదాపు రూ.40 లక్షలదాకా ఖర్చు భరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొన్నాంబళం మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 750కి పైగా ఇంజక్షన్లు ఇచ్చారని, రెండు రోజులకోసారి ఒంట్లో రక్తాన్ని తీసి డయాలసిస్ చేశారన్నాడు. తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదన్నాడు.
సాయం అడగ్గానే..
తాజాగా మరో ఇంటర్వ్యూలో పొన్నాంబళం మాట్లాడుతూ.. కిడ్నీ సమస్య రాగానే ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురుచూశా.. చిరంజీవికి మెసేజ్ పెఇడతే అన్నయ్య వెంటనే ఫోన్ చేశారు. హైదరాబాద్‌కు రమ్మంటే కష్టమని చెప్పడంతో చెన్నై అపోలోలో అడ్మిట్ అవమన్నారు. ఎంట్రీ ఫీజు లేకుండానే నన్ను అడ్మిట్ చేసుకున్నారు. నా ట్రీట్‌మెంట్‌కు రూ.40 లక్షలు అన్నయ్యే భరించారు. లక్షో, రెండు లక్షలో ఇస్తారనుకున్నా.. కానీ, అంతకుమించి సాయం చేశారు. ఇప్పటివరకు నాకు కోటి రూపాయల దాకా సాయం చేశారు అని చెప్పుకొచ్చారు.
చదవండి: అర్ధరాత్రి బస్టాండ్‌లో నిద్ర.. ఆ హీరో నా నెంబర్ తీసుకుని.. జబర్దస్త్ సౌమ్య