వంశీ – దాసరి అవార్డుల వేళ పాత జ్ఞాపకాల్లో నటుడు అలీ
సినిమా, సంగీత, సాహిత్యాది రంగాల్లో 35 మంది ప్రతిభావంతులకు గౌరవం
“ఇప్పటికి 1200కు పైగా సినిమాల్లో నటించిన నేను నా తొలి రోజుల్లో పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజుల్లో నా లాంటి ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టి ఆదరించి, అవకాశాలిచ్చి ఆదుకున్న పెద్ద వ్యక్తి దాసరి” అని ప్రముఖ నటుడు అలీ గుర్తు చేసుకున్నారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా వినుతికెక్కిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ, దాని అధినేత వంశీ రామరాజు హైదరాబాద్‌లో తెలుగు ‘డైరెక్టర్స్ డే’ జరిపారు. త్యాగరాయగానసభలో జరిగిన ఆ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న అలీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.
అప్పట్లో మద్రాసులో ఏటా డిసెంబర్ 31న దాసరి గారు అయ్యప్ప పూజ నిర్వహించేవారు. సినీ రంగంలోని ప్రముఖుల మొదలు సామాన్యుల దాకా అందరూ దాసరి ఇంట్లోని ఆ పూజకు హాజరయ్యేవారు. పూజయ్యాక అక్కడే అందరికీ భోజన ప్రసాదాలు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరికీ రూ. 2 నుంచి రూ. 5 వేల దాకా వేర్వేరు మొత్తాల్లో డబ్బులున్న కవర్లు పంచేవారు. ఎవరికి ఏ మొత్తం ఉన్న కవర్ అందుతున్నది అదృష్టం. కొత్త సంవత్సరం రాబోయే ముందు దాసరి చేతుల మీదుగా అలా డబ్బులు అందుకోవడం శుభసూచకంగా అందరూ భావించేవారు. ముఖ్యంగా, జరుగుబాటు కష్టంగా ఉన్న సామాన్య సినీ కార్మికులు, కళాకారులు అందరూ అధిక మొత్తం డబ్బులున్న కవర్ తమ చేతికి వస్తే బాగుండని ఆశ పడుతుండేవారు.
‘వంశీ – దాసరి… ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు అందుకున్న నటుడు అలీ మాట్లాడుతూ, “పరిశ్రమలో అవకాశాల కోసం కష్టపడుతున్న తొలి రోజుల్లో నేను కూడా దాసరి గారి అయ్యప్ప పూజకు వెళ్ళాను. ప్రసాదం తీసుకున్నాక, దాసరి గారి చేతుల మీదుగా నూతన సంవత్సర శుభాకాంక్షల కవర్ తీసుకున్నాను. బయటకొచ్చి చూస్తే, ఏకంగా రూ.5 వేలున్నాయి అందులో అలా అదృష్టం నన్ను వరించింది. అప్పట్లో నెలకు రెండు పూటలా భోజనానికి మెస్ టికెట్ల కార్డు రూ. 170 కట్టాలి. దానికి కూడా కష్టపడుతున్న నాకు దాసరి వరాలిచ్చిన దేవుడిలా కనిపించారు. ఆ డబ్బుల్లో రూ. 4 వేలు తీసుకెళ్ళి, అప్పటికప్పుడు మెస్ లో కట్టేసి, ఆ డబ్బులకు సరిపడా మెస్ టికెట్ల కార్డులు తీసుకున్నాను. అంటే, ఆ రూ. 4 వేలకు సరిపడా రోజుల దాకా నాకు మద్రాసులో భోజనానికి ఢోకా లేకుండా చేసింది – గురువు గారు దాసరి గారి చేతి చలవే! నాలుగు వేలు పోగా, మిగిలిన వెయ్యి రూపాయలు ఊళ్ళో ఉన్న మా అమ్మ గారికి పంపించాను. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు.
హీరోగా అలీ డేట్లడిగిన దాసరి!
నటుడిగా ఎదిగి, హీరోగా ‘యమలీల’తో ఘన విజయం అందుకున్న తర్వాత దాసరితో ఎదురైన మరో అనుభవాన్ని కూడా అలీ పంచుకున్నారు. “కమెడియన్‌గా గుర్తింపు పొందాక ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో హీరోగా ‘యమలీల’తో కమర్షియల్ హిట్ సాధించడం మరో పెద్ద విజయం. ఆ సినిమా సూపర్ హిట్టయిన రోజుల్లో ఒకసారి హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో దాసరి నన్ను చూశారు. ప్రత్యేకంగా నన్ను పిలిచి, అభినందించారు. దాసరి గారి మాతృమూర్తి కన్నుమూసి అప్పటికి కొద్ది కాలమైంది. మదర్ సెంటిమెంట్ నిండిన ‘యమలీల’కు ఆయన బాగా కనెక్టయ్యారు. ‘పిక్చర్ చాలా బాగుందయ్యా. ముఖ్యంగా, అమ్మ పాత్రతో నీ సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నీలో ఇంత మంచి నటుడున్నాడనీ, హీరో మెటీరియల్ ఉందని నేను గుర్తించలేదు. నువ్వు డేట్స్ ఇస్తే, నిన్ను హీరోగా పెట్టి ఓ మంచి సినిమా చేస్తా’ అన్నారు దాసరి గారు. నా ఆనందానికి అవధులు లేవు. ఉబ్బితబ్బిబ్బై ‘మీరు ఎప్పుడంటే అప్పుడు చేద్దాం గురువు గారూ’ అన్నాను. కానీ, ఆ తరువాత ఆయన రాజకీయాలు వగైరాతో బిజీ అయిపోవడంతో ఆ ఛాన్స్ తప్పిపోయింది. అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు” అని అలీ ఆ సంగతులు వివరించారు.
“తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలతో పాటు నేపాలీ భాషలోనూ నటించే అదృష్టం నాకు దక్కింది. తెలుగు నటులమైన నన్ను, బ్రహ్మానందం గారిని అక్కడి నేపాలీ ప్రేక్షకులు గుర్తుపట్టి, అభిమానించడం మరపురాని విషయం. ఇప్పటికి 1200కి పైగా సినిమాల్లో నటించాను. మరో రెండేళ్ళలో 2028లో సినీ రంగంలో నాకు 50 ఏళ్ళు నిండుతాయి. గతంలో బెస్ట్ కమెడియన్, బెస్ట్ హీరో, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా అనేక అవార్డులు వంశీ సంస్థ నుంచి అందుకున్నా, ఇప్పుడు ఇలాంటి సమయంలో వంశీ సంస్థ నుంచి దాసరి గారి పేరిట ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది” అని ఆయన తన ఆనందానుభూతిని పంచుకున్నారు.
ఇద్దరు కమెడియన్లను కలిపిన అమ్మ ప్రేమ!
మరో ప్రముఖ నటుడు శివారెడ్డి సైతం ఈ సందర్భంగా దాసరి గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. “సినీ రంగానికి గురువు లాంటి పెద్దాయన పేరు మీద నాకు ‘నవరస నటుడు’ అంటూ అవార్డుతో అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. అలీ గారికి వారి అమ్మ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. అలీ గారినీ, నన్నూ కలిపిన అతి పెద్ద బంధం కూడా అమ్మ ప్రేమ. అమ్మ అనేది రెండక్షరాలే అయినా, ఆ పదంలోని ఆత్మీయత, అనుబంధం అందరికీ ఒకటే. ఆయన నాకు అన్న లాంటివాడే కాదు... సినీ రంగంలోనూ, వ్యక్తిగతంగానూ దేవుడు. నాకు ఆదర్శప్రాయుడు. ఇవాళ ఆయన ఇంటి పక్కనే నేనూ నివసిస్తున్నాను. అది అక్షరాలా అలీ అన్న చలవే” అని శివారెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రముఖ సాహితీవేత్త వోలేటి పార్వతీశం సభాధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 35 మంది ప్రతిభావంతులను అవార్డులతో సముచిత రీతిన సత్కరించడం విశేషం.
వివిధ రంగాల్లోని ప్రతిభకు పట్టం!
‘ఆపరేషన్ సిందూర్’ లాంటి అంశాన్ని తీసుకొని, ‘వందే భారత్’ చలనచిత్రాన్ని రూపొందించిన దర్శక – నిర్మాత మల్లం రమేశ్‌కు ‘సెన్సేషనల్ ఫిల్మ్’ అవార్డు అందజేశారు. తెలుగునాట రాష్ట్ర ప్రభుత్వాల నంది, గద్దర్ అవార్డులు రెంటినీ పొందిన తొలి జర్నలిస్టు అయిన డాక్టర్ రెంటాల జయదేవకు ప్రత్యేకంగా ‘ఉత్తమ సినీ విమర్శకుడు – చరిత్రకారుడు’ అవార్డును అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేసి, గౌరవించారు. అలాగే, మరో సీనియర్ జర్నలిస్ట్, సినీ గ్రంథ రచయిత, సినీ రచయిత పులగం చిన్నారాయణకు ‘బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్’ అవార్డునిచ్చారు.
సినీ రంగంతో పాటు సంగీతం, సాహిత్యం, విద్య, వైద్యం, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ‘వంశీ – దాసరి గ్లోబల్ అవార్డు’లను అలీ, శివారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే, ప్రవాస రాష్ట్ర – భారతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, ఆదర్శ దంపతులను సైతం ప్రత్యేకంగా గుర్తించి గౌరవించారు.
డైరెక్టర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శక సమ్రాట్!
1972లో స్థాపితమైన వంశీ సంస్థ ఇప్పటికి 54 ఏళ్ళుగా సాంస్కృతిక రంగంలో ఉంటూ, వివిధ దేశాలకు సైతం విస్తరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే 3 విశ్వవిద్యాలయాల్లో తమ సంస్థ పక్షాన ప్రతిభావంతుల్ని గుర్తించేలా స్వర్ణపతకాలు ఏర్పాటుచేసినట్టు వంశీ రామరాజు వివరించారు. సాహితీ, సినీ రంగాల్లో మరపురాని సేవలు అందించిన మహామహుల్ని క్రమం తప్పకుండా స్మరించుకోవడానికి సంస్థ సాగిస్తున్న కృషిని వోలేటి పార్వతీశం ప్రశంసించారు. “దాసరి కన్నా ముందు ఎందరో దిగ్గజ దర్శకమూర్తులు లేకపోలేదు. వారు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించనూ లేకపోలేదు. కానీ, దర్శకుడికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చి, డైరెక్టర్ పేరు మీద సినిమా చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులలో కలిగించిన దిగ్దర్శకుడు దాసరి. కౌటుంబిక కథలు, సన్నివేశాలు, సామాన్యంగా అనిపించే, వినిపించే టైటిల్స్‌తోనే అఖండ విజయాలు సాధించిన దర్శక సమ్రాట్ ఆయన” అని పార్వతీశం విశ్లేషించారు.
కళాత్మకత... కమర్షియాలిటీల మేళవింపు!
‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి డాక్టర్ వెలుదండ నిత్యానందరావు సోదాహరణ పూర్వక విశ్లేషణ సాగిస్తూ, “కుటుంబ ఇతివృత్తాలు, వ్యంగ్యం నిండిన డైలాగులు, నూతన ప్రతిభాన్వేషణ, వేగవంతమైన సినీ రూపకల్పన... దాసరి ప్రత్యేకత. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ లాంటి చిత్రాల్లో కథావస్తు స్వీకరణలో ఆయన చూపిన కొత్తదనం కనిపిస్తుంది. ‘మేఘసందేశం’ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ‘ఆకులో ఆకునై...’ లాంటి గీతాన్ని సందర్భోచితంగా వాడుకోవడం దర్శకుడి కళాత్మకతను తెలియబరుస్తుంది. అందుకే దాసరి అటు కళాత్మకతకు, ఇటు వాణిజ్య అంశాల్ని మేళవించిన అపురూప దర్శకుడు. ఒకప్పుడు ‘వంశీ – బర్కిలీ’ అవార్డు పొందిన ఆయన ఆ పైన తన పేరు మీదే ‘దాసరి – వంశీ’ అవార్డులిచ్చే స్థాయికి ఎదగడం, 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అసాధారణం” అని పేర్కొన్నారు. 1987లో ‘ఉదయం’ పత్రికతో దాసరి సృష్టించిన సంచలనాన్ని ప్రస్తావిస్తూ, తాను ఎం.ఏ. విద్యార్థిగా ఉన్న రోజుల్లో తన తొలినాళ్ళ సాహితీ వ్యాసాలెన్నో ఆ పత్రికలోనే వచ్చాయని వైస్ – ఛాన్సలర్ గుర్తు చేసుకున్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, వివిధ రంగాల ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం ఎప్పుడూ ముందుంటాయని నిత్యానందరావు తెలియజేయడం విశేషం. ఎంతైనా, ఆయనే అన్నట్టు “యోగ్యులనూ, అర్హులనూ గౌరవించి, సత్కరిస్తే... అది వారిని గౌరవించినట్టు కాదు... మనల్ని మనం గౌరవించుకున్నట్టు!”
- రెంటాల జయదేవ


