
సినిమా హీరోలను దేవుడిలా అభిమానులు పూజిస్తారు. మరి ఆ హీరోలే మరోకరిని తమ జీవితానికి ఆదర్శంగా తీసుకుంటే అతనెంత గొప్పవాడై ఉంటాడో అని ఆలోచిస్తాం. సరిగ్గా అలాంటి సన్నివేశమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లైఫ్‌లో ఒకటి ఉంది. అజిత్ తాజాగా తన అభిమాన కార్ రేసర్‌కు నివాళులు అర్పించారు. ఆయనపై తన అభిమానం ఏపాటిదో వీడియోతో చూపాడు. దానిని చూసిన అజిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అజిత్ తాజాగా ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఇటలీ పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానం ఎలాంటిదో చూపాడు. అయర్టన్ సెన్నా విగ్రహాన్ని కొంత సమయం పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. బ్రెజిల్ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సెట్ చేశాడు. 1994 కార్ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.
అజిత్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ రేసర్‌గానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్‌లకు కాస్త విరామం దొరికితే చాలు రేసింగ్ బైక్స్, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. అంతర్జాతీయ కార్ రేసింగ్‌లలో కూడా ఆయన పాల్గొని సత్తా చాటారు. ఆపై తన రేసింగ్ టీమ్‌ను కూడా కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో టీమ్‌ను ఏర్పాటు చేశారు.