
సందేశాత్మక సినిమాను తీయడం ఒకెత్తయితే... ఆ సినిమాను సకల జనులకు చేరువగా తీసుకువెళ్లడం మరొకెత్తు. ఇలాంటి ఎత్తులను అధిరోహించినప్పుడే ఆ చిత్రం సంపూర్ణ శిఖరాగ్రం చేరుకున్టట్టు అర్ధం. ప్రస్తుతం అతి తక్కువ సినిమాలు మాత్రమే అలా శిఖరారోహణ చేయగలుగుతున్నాయి. ఓ వైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మరోవైపు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న.... బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్వీయ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందిన సితారె జమీన్ పర్ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది.
ఈ సినిమాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చోట ఉన్న థియేటర్ లో ప్రదర్శించారు. గత 13న భారతదేశంలో ఉన్న అత్యధిక ఎతైన థియేటర్ లో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. ఆ థియేటర్ పేరు పిక్చర్‌టైమ్. ఈ 11,562 అడుగుల ఎత్తున ఉన్న లడఖ్‌లోని మొబైల్ డిజిటల్ థియేటర్‌లో అమీర్ ఖాన్ నటించిన కామెడీ–డ్రామా చిత్రం’ ప్రత్యేక ప్రదర్శన జరిగింది.
ఈ ప్రదర్శనలో పలువురు ఆటిజం చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రేక్షకులుగా హాజరవగా, స్థానిక డా.దాయ్‌చిన్స్ హోప్‌ఫుల్ స్టెప్స్ క్లినిక్ కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. థియేటర్ బయట, అందమైన లడఖ్ నేపధ్యంలో చిన్నారులు సినిమాలోని హాస్యానికి, ఉత్తేజానికి అనర్గళంగా నవ్వుతూ ఆనందించగా, వారి తల్లిదండ్రులు పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషం చూసి మురిసిపోతూ కనిపించారు.
అమీర్ ఇటీవల ‘‘భారతీయ సినిమాలు అన్ని ప్రాంతాలకు, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి’’ అని వేవ్స్‌సమ్మిట్‌లో అభిప్రాయపడ్డారు. అచ్చంగా దీన్నే పిక్చర్ టైమ్ సంస్థ అనుసరించింది. ఈ సందర్భంగా పిక్చర్ టైమ్ నిర్వాహకులు సుశీల్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఒక అమూల్యమైన వీక్షణ అనుభవం అన్నారు.
ధియేటర్ విశేషాలివే... భారతదేశంలో, బహుశా ప్రపంచంలోనే అత్యంత ఎతైన సినిమా థియేటర్, లడఖ్‌లోని లేహ్‌లో ఉన్న పిక్చర్‌టైమ్ డిజిప్లెక్స్ ఇన్‌ఫ్లేటేబుల్ థియేటర్, దీనిని లేహ్‌లోని ఎన్‌ఎస్‌డీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. సరసమైన ధరలోనే టిక్కెట్లు, మంచి సీటింగ్ ఏర్పాట్లతో కూడిన ఈ మొబైల్, ఇన్‌ప్లేటేబుల్ థియేటర్‌ను మారుమూల ప్రాంతాలకు కూడా సినిమా వీక్షణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగేళ్ల క్రితం విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్‌తో థియేటర్ ప్రారంభం కాగా అదే రోజున బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్‌బాటమ్‘ చిత్ర ప్రదర్శన కూడా జరిగింది.
చలికాలంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి తరచుగా దూరమయ్యే ప్రాంతం లడఖ్‌కు ఈ మొబైల్ థియేటర్ స్థాపన చాలా ముఖ్యమైనది. వినోదానికి మూలాన్ని స్థానిక చిత్రనిర్మాతలు కళాకారులకు వేదికను ఈ థియేటర్ అందిస్తుంది ఈ మొట్టమొదటి మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ –28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో సైతం పనిచేసేలా ప్రత్యేక సాంకేతికతతో ఏర్పాటైంది.