C Kalyan : 'థియేటర్‌ రెంటల్‌ వ్యవస్థ మారాలి.. కానీ కొందరు పెద్దవాళ్లు మారనివ్వరు'

30 Days Industry Strike Is Utter Flop Show Says Producer Kalyan - Sakshi

‘‘ఈ మధ్య 30రోజులు షూటింగ్‌ ఆపడమనేది అట్టర్‌ ఫ్లాప్‌ షో. చిన్న చిత్రాల నిర్మాతలు రిలీజ్‌ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం దొరుకుతుందని సమ్మెకి సమ్మతించా. అయితే సమ్మె వల్ల ఏం జరగదని నాలుగు మీటింగ్స్‌లోనే అర్థమైంది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించినా వాటి పరిష్కారం జరగలేదు. సినిమా పరిశ్రమ బతికుందంటే కొత్తగా వచ్చే నిర్మాతల వల్లే’’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్‌ అన్నారు.

నేడు (శుక్రవారం) తన పుట్టినరోజుని పురస్కరించుకుని సి. కల్యాణ్‌ మాట్లాడుతూ–‘‘చెన్నైలో సహాయ దర్శకుడిగా నా కెరీర్‌ ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 200 కోట్లతో ‘కల్యాణ్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌’ ప్రాజెక్ట్‌ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. సదరన్‌ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు మించి అవార్డ్స్‌ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ వ్యాఖ్యలు సరికాదు. చిరంజీవిగారి సినిమా నిర్మాతలుగానీ, బాలకృష్ణగారి మూవీ నిర్మాతలుగానీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయలేదు.. అలాంటప్పుడు రిలీజ్‌ విషయంలో కౌన్సిల్‌ మాట్లాడటం వంద శాతం తప్పు.

థియేటర్లు రెంటల్‌ వ్యవస్థ నుండి పర్సంటేజ్‌లోకి మారిస్తే బాగుంటుంది. కానీ, కొందరు పెద్దవాళ్లు మారనివ్వరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లాబ్‌ సిస్టం తెస్తే కానీ ఇది మారదు. సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్‌ రెండో ఊరు అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు మాత్రమే వెళుతున్నారు.. ఆ రకంగా ఒక దూరం వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ వాళ్లు ఇక్కడి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండరని భావిస్తాను. గతంలో కృష్ణా నుండే పది మంది పరిశ్రమలోకి వచ్చి అందులో ఎవరో ఒకరు సక్సెస్‌ అయ్యేవారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిగారికి మాత్రం ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలని ఉంది. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ సినిమా పూర్తయింది. అలాగే బాలకృష్ణగారితో ‘రామానుజాచార్య’ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top