ఆగని అక్రమ రవాణ
● గుట్టుగా సరిహద్దులు దాటుతున్న వైనం
● మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలింపు
● కొందరు డీలర్లు, అధికారుల కుమ్మక్కు
5 నెలల్లో పట్టుబడిన రేషన్ బియ్యం:
3,864 క్వింటాళ్లు
పట్టుబడిన వాహనాలు
16
నమోదైన కేసులు 17
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందానా ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో, సన్న బియ్యం సరిహద్దులు దాటుతోంది. దీని వెనుక ఎవరున్నారనేది అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
– రామాయంపేట(మెదక్)
రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ అక్రమ దందాకు కొందరు డీలర్లు, సంబంధితశాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ బృందం ఐదు నెలల వ్యవధిలో 3,864 క్వింటాళ్ల మేర రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. వీటిలో చాలా భాగం జాతీయ రహదారిపై పట్టుబడినవే కావడం గమనార్హం. ఎక్కువ శాతం బియ్యం మహారాష్ట్ర, గుజరాత్, కోళ్ల ఫారాలకు తరలుతున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారులకు మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటాను ఒకేసారి ఇవ్వడంతో కొంత మంది అమ్ముకుంటున్నారు. జిల్లాతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చెందిన దళారులు 10– 15 రూపాయలకు కిలో చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వారు రూ.20 నుంచి రూ. 25 వరకు అమ్ముకుంటున్నా రు. ఇది లాభసాటి బేరం కావడంతో గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై ఇంటింటికీ తిరుగుతూ బియ్యం కొంటున్నారు.
ప్రత్యేక నిఘా పెట్టిన విజిలెన్స్
ఇటీవల రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు పౌర సరఫరాలశాఖ విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జాతీయ రహదారిపై అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. గతంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద హైవేపై భారీ ట్రక్‌లో తరలుతున్న 422 క్వింటాళ్లు, అలాగే.. రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై లారీలో తరలుతున్న 300 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్ అధికారులు పట్టుకున్నారు. పలు రైస్ మిల్లులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటున్నాం
రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ తరలకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. తమకు ఏమాత్రం సమాచారం వచ్చినా వెంటనే దాడులు చేసి పట్టుకుంటున్నాం. మహారాష్ట్రకు కొందరు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. బియ్యం అక్రమ రవాణా విషయమై తమకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– నిత్యానందగౌడ్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి


