కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గోసను సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తూ ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా గోనె సంచులు అందించాలన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


