మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 17,254 మంది రైతుల నుంచి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వారి ఖాతాల్లో రూ.86 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రోజువారీగా కేంద్రాల్లో నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.
నేటి నుంచి సమ్మర్ క్యాంపు
నర్సాపూర్: నేటి నుంచి తమ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామని పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సామ్యానాయక్ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి ఈనెల 25 వరకు క్యాంపు కొనసాగుతుందని చెప్పారు. పట్టణంలోని విద్యార్థులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
12న ఎస్సీ కార్పొరేషన్
ఇంటర్వ్యూలు
పెద్దశంకరంపేట(మెదక్): ఈనెల 12న (మంగళవారం) ఎస్సీ కార్పొరేషన్‌లో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ క్రాంతికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 11 గంటలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
కుస్తీమే సవాల్
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని మక్తలక్ష్మాపూర్‌లో మానిక్ ప్రభు జాతర వైభవంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
నేడు ఎంజేపీలో
కౌన్సెలింగ్
కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9వ తరగతిలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాసి సీట్లు పొందిన విద్యార్థులకు సోమవారం తునికి ఎంజేపీ బీసీ గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ రాజేశం, జిల్లా కన్వీనర్ హరిబాబు తెలిపారు. ఆయా తరగతుల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు సమాచారం ఇచ్చామన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ ద్వారా బాలురు, బాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లాలలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామన్నారు.
కార్పొరేట్ల కోసమే
లేబర్‌కోడ్స్
మెదక్ కలెక్టరేట్: సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో లేబర్‌కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్మిక, శ్రామికవర్గంపై యుద్ధం మొదలుపెట్టిందని మండిపడ్డారు. లేబర్ కోడ్స్ శ్రామికుల మెడకు బిగించిన ఉరితాళ్లని ఆరోపించారు. ఎన్నికల వేళ మాయమాటలతో ప్రజలను వంచించిన పాలకులు, గద్దెనెక్కిన వెంటనే కార్పొరేట్ శక్తుల పాదాల చెంత కార్మిక హక్కులను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, ప్రజాసంఘాల నాయకులు మల్లేశం, అజయ్, దుర్గ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.


