మెదక్ కలెక్టరేట్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, సిద్దు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్‌లోని తపస్ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు పాత పెన్షన్ విధానం అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం నిరాకరించడం సరికాదన్నారు. హైకోర్టు సానుకూల తీర్పునిస్తూ, మూడు నెలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల కు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సభ్యులు నర్సింలు, మెదక్, నార్సింగి మండలల అధ్యక్షులు నరేందర్, స్వామి పాల్గొన్నారు.


