నర్సింగ్‌ హోంల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ హోంల పరిశీలన

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని పలు ప్రైవేటు నర్సింగ్‌హోంలను శుక్రవారం రెడ్డిపల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రఘువరన్‌, శివ్వంపేట పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాయిసౌమ్యలు పరిశీలించినట్లు తెలిపారు. నర్సింగ్‌హోంలలో డెలివరీలు నిర్వహించేందుకు వసతులు పరిశీలించామని..నిబంధనల మేరకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. అందుకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సక్రమంగా నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. వారి వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.

ఆంజనేయస్వామికి

ఛెప్పన్‌బోగ్‌ నైవేద్యం

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికిలో శుక్రవారం ఆంజనేయస్వామికి హనుమాన్‌ మాలధరించిన భక్తులు ఛెప్పన్‌బోగ్‌ మహా నైవేద్యం సమర్పించారు. గ్రామ పూజారి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి చందన అలంకరణ చేశారు. అనంతరం పండ్లు, స్వీట్లు, పులిహోర, పాయాసం తదితర ఛెప్పన్‌బోగ్‌ మహానైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధనలక్ష్మి, ఉపసర్పంచ్‌ ప్రవీన్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ శేఖర్‌, హనుమాన్‌ దీక్ష భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

250 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

తూప్రాన్‌: పేదలకు పంపిణీ చేయాల్సిన 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. వివరాలు ఇలా.. కర్ణాటక నుంచి చత్తీస్‌గఢ్‌కు లారీలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందిందన్నారు. తూప్రాన్‌ పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం గుర్తించామని తెలిపారు. లారీలోని బియ్యాన్ని సివిల్‌ సప్‌లై అధికారులకు అప్పగించినట్లు చెప్పారు.

వైభవంగా బోనాలు

పెద్దశంకరంపేట(మెదక్‌): మండల పరిఽధి మక్తలక్ష్మాపూర్‌లో మానిక్‌ప్రభు జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గ్రామ పురవీధుల గుండా మహిళలు భక్తిశ్రద్ధలతో తరలివెళ్లి స్వామి వారికి బోనాలను సమర్పించారు. శివసత్తుల నృత్యాలు, యువకుల కేరింతల మధ్య బోనాలను ఊరేగించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

జీలుగతో 30 శాతం యూరియా

చేగుంట(తూప్రాన్‌): జీలుగ వేసుకుంటే పంటలకు 30శాతం యూరియా లభిస్తుందని సైంటిస్టు సుజాత పేర్కొన్నారు. మండలంలోని కసాన్‌పల్లి ఇబ్రహీంపూర్‌, వడియారం వల్లభాపూర్‌ గ్రామాల్లో రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవ ఎరువుగా జీలుగను వేసుకొని దుక్కిలో దున్నేస్తే పంటలకు ఎరువు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ హరిప్రసాద్‌, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement