రోడ్లపై ధాన్యం..
నిజాంపేట (మెదక్): అన్నదాతలు పండించిన పంటను ఆరబోసేందుకు కల్లాలు లేక రోడ్లపై ఆరబోస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధి నార్లాపూర్ గ్రామ శివారు నుంచి కల్వకుంట కమాన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై వడ్ల కుప్పలతో నిండిపోయింది. ధాన్యం ఆరబోయడమే కాకుండా, ధాన్యం కుప్పల రక్షణ కోసం వాటి పక్కన పెద్ద పెద్ద రాళ్లను పెడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ఈ రాళ్లను, వడ్ల కుప్పలను గమనించక ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గత ఏడాది ఇదే రహదారిపై వడ్ల కుప్పను ఢీకొని ఒక వ్యక్తి మరణించిన ఉదంతం ఉన్నప్పటికీ, అటు రైతులు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మండలంలోని వెంకటాపూర్ (కె) గ్రామంలో రోడ్డుపైనే ధాన్యం తూకం వేయడం వల్ల గన్నీ సంచులు కూడా అడ్డంగా పడి ఉంటున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వెంకటాపూర్ (కె) గ్రామంలో బస్టాండ్ వద్ద కుడివైపు ఆరబోసుకున్న ధాన్యం.. ఎడమ వైపు నుంచి పోయడం వల్ల రాత్రి పూట ముందు ఉన్న ధాన్యం కుప్పలు కనిపించకుండా పోతున్నాయి. అంతేకాకుండా రోడ్లపైనే గన్నీ సంచులను ఉంచడంతో రాత్రి పూట తిరిగే వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రహదారులపై ధాన్యం ఆరబోయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇబ్బందుల్లో వాహనదారులు
తరచూ ప్రమాదాలు
పట్టించుకోని అధికారులు


