చిలప్‌చెడ్(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఏ.మల్లేశం అన్నారు. శుక్రవారం మండల పరిధి బండపోతుగల్ గ్రామంలో ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరితో పాటు, మొక్కజొన్న, జొన్నల కోతలు ప్రారంభం అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పలు గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినా, ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదన్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి, నష్టాలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగునీటిని సైతం ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. తూకంలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు సమస్యలపై ఈ నెల11న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.మల్లేశం, శేఖర్, నర్సింలు, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహించొద్దు
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, రైస్‌మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం మండలంలోని మంగళపర్తి, హస్తాల్‌పూర్ శివారులోని సర్వే నం.401, 283లకు సంబంధించిన అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదంపై తహసీల్దార్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. కొన్నిచోట్ల హమాలీల కొరత ఉండడం వల్ల ఆలస్యం జరుగుతుందని, ఆయా కేంద్రాల్లో రెండు, మూడు రోజుల్లో కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, గిర్దావర్ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
రామాయంపేట(మెదక్): స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఽగొల్పర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, పుట్టి సందీప్, గౌస్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల యాదగిరి, డీసీసీ కార్యదర్శి గణేశ్, నాయకులు డాకి స్వామి, మోబిన్, పాల్గొన్నారు.
సీపీఎం నాయకుడు మల్లేశం


