ఒక్కో బస్తాపై రూ.175 నుంచి రూ.400 వరకు పెంపు | - | Sakshi
Sakshi News home page

ఒక్కో బస్తాపై రూ.175 నుంచి రూ.400 వరకు పెంపు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

● పెరగనున్న పెట్టుబడి వ్యయం ● జిల్లా రైతులపై రూ.4 కోట్లపైచిలుకు భారం

● పెరగనున్న పెట్టుబడి వ్యయం ● జిల్లా రైతులపై రూ.4 కోట్లపైచిలుకు భారం

రువుల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.175 నుంచి రూ. 400 వరకు పెరిగింది. కొత్త ధరలను ఇప్పటికే సదరు కంపెనీలు డీలర్లకు పంపించినట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులపై అదనపు భారం పడనుంది. ఓ వైపు చీడపీడలు.. మరోవైపు అనుకూలించని వాతావరణంతో సతమతమవుతున్న కర్షకులకు ఎరువుల ధరల పెంపు గుదిబండగా మారనుంది. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 3.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందుకోసం అన్నిరకాల ఎరువులు 62,215 మెట్రిక్‌ టన్నుల అవసరం అవుతాయని అంచనా వేసింది. కాగా జిల్లాలో యూరియా, డీఏపీ, పొటాషియం, కాంప్లెక్‌, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ (ఎస్‌ఎస్‌పీ) పొటాష్‌ ఎరువులను రైతులు ఎక్కువగా వాడుతారు. కాగా వీటిలో యూరియా, డీఏపీ తప్ప మిగితా ఎరువుల ధరలన్నీ పెరిగాయి. దీంతో జిల్లా రైతాంగంపై సుమారు రూ.4 కోట్ల పైచిలుకు అదనపు భారం పడనుంది.

మూలిగే నక్కపై తాటి పండు

ఎరువుల ధరలను అమాంతం పెంచటంతో అన్నదాతల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంట చేతికందే సమయంలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం అందలేదు. కాగా ఈ ఖరీఫ్‌లోనైనా పంటలు పండించి గతేడాది నష్టాన్ని కొంతమేర పూడ్చుకుందామనుకునే రైతులకు పెరిగిన ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి.

పాత నిల్వలకు కొత్త ధరలు!

పెరిగిన ఎరువుల ధరలు రైతుకు పుండుపై కారం చల్లినట్లు అవుతుంటే, డీలర్లు, విక్రయదారులకు మాత్రం కాసులు కురిపించే విధంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. పాత నిల్వలను దాచేసి పెరిగిన ధరను క్రోడీకరించి రైతులకు అంటగడుతున్నట్లు తెలిసింది. పెరిగిన కొత్త ధరలకే విక్రయాలు జరుపుతున్నారని, పాత నిల్వలు లేవని చెబుతున్నట్లు సమాచారం.

పెరిగిన ధరలు ఇలా..

ఎరువు రకం బస్తా పాత ధర కొత్తది

కాంప్లెక్స్‌

(20–20–13) రూ.1,500 రూ.1,800

కాంప్లెక్స్‌

(16–20–13) రూ.1,400 రూ.1,750

అమ్మోనియా రూ.1,000 రూ.1,400

పొటాష్‌ రూ.1,800 రూ.1,975

Advertisement
 
Advertisement
Advertisement