భూ భారతిలో యూజర్‌ బాదుడు | - | Sakshi
Sakshi News home page

భూ భారతిలో యూజర్‌ బాదుడు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌కు అదనంగా రూ.500 సమాచారం లేకుండా వసూళ్లు ఏంటని ప్రశ్నిస్తున్న రైతులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/నిజాంపేట (మెదక్‌): భూభారతిలో కొత్తగా యూజర్‌ చార్జీల బాదుడు షురూవైంది. గతంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే యూజర్‌ చార్జీలు వసూలు చేసేవారు కాదు. అయితే బుధవారం నుంచి ప్రతీ స్లాట్‌ బుకింగ్‌పై రూ.500 చొప్పున యూజర్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ చార్జీలు చెల్లిస్తేనే స్లాట్‌ బుక్‌ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రభుత్వం యూజర్‌ చార్జీలు వసూలు చేయడమేమిటని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే స్లాట్‌ బుకింగ్‌ సమయంలో ఆ భూమి రిజిస్ట్రేషన్‌ విలువను బట్టి స్టాంప్‌ డ్యూటీ, మ్యూటేషన్‌ చార్జీలు, పట్టాదారు పాసుపుస్తకం (కొరియర్‌ చార్జీలతో కలిపి) ధర, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, హరిత నిధి కింద ఆయా మొత్తాలను వసూలు చేసేవారు. ఈ చార్జీలతో పాటు యూజర్‌ చార్జీల పేరుతో రూ.500 అదనంగా రశీదు జనరేట్‌ అవుతోంది.

నిత్యం పది నుంచి 25 రిజిస్ట్రేషన్లు

మ్మడి మెదక్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి మొత్తం 75 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ప్రతీ రోజు సగటున పది నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన ప్రతీ స్లాట్‌పై అదనంగా రూ.500 చొప్పున అదనపు చార్జీలు వసూలు చేయడంతో భూములు కొనుగోలు చేసే రైతులపై సుమారు రూ.3.75 లక్షల నుంచి రూ.9.37 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.

చార్జీల వసూలు తగదు

నేను రెండురోజుల క్రితం రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఎలాంటి ఈ యూజర్‌ చార్జీలు వసూలు చేయలేదు. మంగళవారం నాటికి స్లాట్‌ బుక్‌ చేసుకున్నా. కానీ తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వర్‌ డౌన్‌ ఉందని చెప్పడంతో బుధ వారం కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లాను. అక్కడ సిబ్బంది మీసేవ కేంద్రానికి వెళ్లి రూ.500 చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు. మీసేవ కేంద్రానికి వెళ్లి చూసుకుంటే అందులో కొత్తగా యూజర్‌ చార్జీలు వేశారు. ముందు చెప్పకుండా రైతులపై భారం మోపడం సరికాదు.

– రెడ్డి స్వామి, రైతు, నిజాంపేట, మెదక్‌ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement