నారాయణఖేడ్: మల్టీపర్పస్ ఏఎన్‌ఎం, నర్సింగ్ అధికారుల పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వైద్య, ఆరోగ్య శాఖలో 18 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖేడ్‌లో రూ. కోటితో నిర్మించిన బాలసదనం భవనాన్ని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య, మహిళా సాధికారితకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామని చెప్పారు. బాలసదనం బాలికలతో మంత్రి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఖేడ్‌లో బాలసదనం ఏర్పాటు చేసినా స్వంత భవనం లేక పడుతున్న ఇబ్బందులు పక్కా భవనం నిర్మాణంతో తీరనుందన్నారు. మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్యంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను ప్రొత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
త్వరలో మల్టీపర్పస్ ఏఎన్‌ఎం ఫలితాలు


