జూలై 31వ తేదీ వరకు అవకాశం
ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) కు ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపింది. ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జూలై 31 వరకు గడువు విధించింది. గతేడాది 2025 జూన్‌లో సైతం అవకాశం ఇవ్వగా, కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేసిన వారిలో 10,050 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. – మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, నార్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 14,818 మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర కిత్రం ప్రభుత్వం క్రమబద్ధీకరణకు నెలరోజుల పాటు గడువు ఇచ్చింది. లబ్ధిదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా ఉంటేనే క్రమబద్ధీకరించాలని మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. దీంతో అధికారులు నాలుగు బల్దియాల పరిధిలో సక్రమంగా లేని 1,382 దరఖాస్తులను తిరస్కరించారు. మిగితా 13,436 సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ వారిలో కేవలం 4,768 మంది మాత్రమే ముందుకొచ్చి రూ.13.7 కోట్లు ఫీజుల రూపంలో చెల్లించారు. ఇంకా 8,668 మంది ఫీజు కట్టాల్సి ఉంది. కాగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం అనుమానంగా కన్పిస్తోంది. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసి ఇప్పటి ఆరేళ్లు కావొస్తుండటంతో ప్లాట్లు చేతులు మారాయి. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పలువురు ప్లాట్లను అర్థిక అవసరాల నిమిత్తం విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఐదుగురు నుంచి ఆరుగురికి చేతులు మారాయి. దీంతో దరఖాస్తు చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి తెలియదు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ సమాచారం అందరికీ చేరడం లేదు. దరఖాస్తు చేసే సమయంలో ఫోన్ నంబర్లను సైతం అప్‌లోడ్ చేశారు. అలాగే కొందరి ఫోన్ నంబర్లు పని చేయకపోవడంతో ఫీజు చెల్లింపు సమాచారం చేరడం లేదు.
జిల్లాలోని 4 బల్దియాల్లో 14,818 దరఖాస్తులు
ఫీజు చెల్లించింది 4,768 మంది మాత్రమే
మరోసారి 25 శాతం రాయితీ
ముందుకొచ్చే వారెందరో?
అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మూడు నెలల పాటు అవకాశం ఇచ్చింది. చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనునట్లు బల్దియా అధికారులు ప్రకటించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. మరి ఈసారి ఎంతమంది ముందుకొచ్చి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తారో వేచి చూడాలి.


