మున్సిపాలిటీల్లో నిలిచిన ప్రగతి
తూప్రాన్: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలలు దాటినా ముందుకు సాగకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసింది. వీటితో అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు మున్సిపల్ ఎన్నికల ముందు హడావుడిగా ఆయా వార్డుల్లో రోడ్లను తవ్వారు. డ్రైనేజీ పనులు చేపట్టారు. ఇందులో కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
రాజకీయ లబ్ధి కోసమేనా!
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా మున్సిపాలిటీల్లో పనులు చేపట్టిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కై వసం చేసుకోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులలో రూ.8 కోట్ల వరకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని పనులకు టెండర్లు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు.ఫలితంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారులు స్పందించి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం
మున్సిపాలిటీకి ప్రభుత్వం పట్టణ అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 16 వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభించాం. సదరు కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– గణేశ్‌రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్


