నేరుగా సంప్రదించాలి | - | Sakshi
Sakshi News home page

నేరుగా సంప్రదించాలి

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన అపోలో ఫార్మసీ వారి ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళా ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి పట్టణం బైపాస్‌ రోడ్డులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మెదక్‌జోన్‌: ప్రజావాణి ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీనివాసరావు పో లీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం నేరుగా సంబంధిత పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్‌శాఖ అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.

ఆరుతడి పంటలు వేయాలి

నర్సాపూర్‌ రూరల్‌: రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని నర్సాపూర్‌ వ్యవసాయశాఖ ఏడీ సంధ్యారాణి సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం మండలంలోని లింగాపూర్‌ రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఏటా పంట మార్పిడి చేయడంతో పాటు సేంద్రియ ఎరువులతో ఆరుతడి పంటలు సాగు చేసుకొని, మంచి దిగుబడులు సాధించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, సౌర విద్యుత్‌, వ్యవసాయ యాంత్రీకరణ వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ దుర్గా ప్రసాద్‌, లింగాపూర్‌ క్లస్టర్‌ రైతులు పాల్గొన్నారు.

బీజేపీ శ్రేణుల సంబరాలు

నర్సాపూర్‌: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పట్టణంలో సోమవారం ఆపార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సురేశ్‌, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, నాయకులు చంద్రయ్య, రాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

మెదక్‌ కలెక్టరేట్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దొంతి నరేశ్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్‌, పంటల రుణమాఫీ వంటి పథకాలు అమలు చేసిందన్నారు. రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి సాయిల్‌ హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

6న జాబ్‌ మేళా

Advertisement
 
Advertisement
Advertisement