తూప్రాన్: జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. రోజూ 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతు న్నారు. ముఖ్యంగా చిన్నారులతో పాటు వృద్ధులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతకు శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. రోజూ సుమారు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు.
ఇవి తప్పనిసరి
వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కనుక అధికంగా కొబ్బరి బొండం తాగడం శ్రేయస్కరం. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
ఆహార నియమాలు
నాన్‌వెజ్ కంటే పప్పు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. దోస, కీరదోస తింటే మంచిది. వేపుడు కూరలకు స్వస్తి పలికి, పులుసులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి.
అప్రమత్తంగా ఉండాలి
ఎండలో ఎక్కువగా తిరిగితే వడదెబ్బ సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు, కండరాల నొప్పులు ఎక్కువ గా ఉంటాయి. ఎండ ప్రభావం మెదడుపై పడి శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దీంతో కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి.
– అమర్‌సింగ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్


