ప్రత్యామ్నాయ పంటలు మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు మేలు

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

ప్రత్యామ్నాయ పంటలు మేలు

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. జిల్లాలో వరి ఎక్కువగా సాగు చేస్తున్నారని, ఒకే పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూలు ఇతర పంటలను రైతులు సాగు చేయాలన్నారు. మెదక్‌ జిల్లా హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నందున మార్కెట్‌ చేసుకోవడానికి సులభంగా ఉంటుందని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. అనంతరం డీఏఓ దేవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించాలన్నారు. దీంతో ఎరువుల వినయోగం, ఖర్చు తగ్గుతుందన్నారు. విత్తనాల ఎంపిక కీలకమని, మొలకశాతం పరీక్షించి పంట సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైతులకు భూసార పరీక్షల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీజేటీఏయూ శాస్త్రవేత్తలు అనీత, కార్తీక్‌, ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్‌, సర్పంచ్‌ చంద్రం కృష్ణాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి

మెదక్‌ కలెక్టరేట్‌: రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో వివిధశాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో లోడింగ్‌, ఆన్‌లోడింగ్‌ పక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వేసవిలో తాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా తీశారు. సాదా బైనామాల సమస్యలు పరిశీలించాలని, జనగణన ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఇతర మంత్రులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement