అటకెక్కిన ‘ఆలన’ | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ‘ఆలన’

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

అటకెక్కిన ‘ఆలన’ ● రోగులకు దక్కని వైద్య సేవలు ● మూణ్నాళ్ల ముచ్చటగా మారిన పథకం ● తుప్పు పడుతున్న వాహనాలు

● రోగులకు దక్కని వైద్య సేవలు ● మూణ్నాళ్ల ముచ్చటగా మారిన పథకం ● తుప్పు పడుతున్న వాహనాలు

రామాయంపేట(మెదక్‌): ఆలన.. నిరాధరణకు గురై మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం. జిల్లాలోనే మొట్టమెదటిగా తూప్రాన్‌ డివిజన్‌ నుంచి శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన పథకం ఉన్నట్టుండి రద్దు అయింది. అప్పటి నుంచి నిరుపేద వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.

తొలి ప్రాజెక్టుకు ఆటంకాలు

ఆలన పథకానికి సంబంధించి గత ప్రభుత్వం మొదటి విడతగా 12 జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో మెదక్‌ జిల్లా ఒకటి. ఈపథకం కింద జిల్లాలో నార్సింగి, తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాలను చేర్చారు. వీటి పరిధిలో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించి నిరాశ్రయులైన 660 మంది వ్యాధిగ్రస్తులు గుర్తించారు. వారికి వైద్య సేవలు అందించడానికి గాను జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌ ఏరియాలకు ఒక్కో వాహనం చొప్పున కేటాయించారు. డాక్టర్‌, ఇతర సిబ్బందిని సైతం నియమించారు. తూప్రాన్‌లో వాహనాన్ని అప్పటి డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కొన్నాళ్ల పాటు ఈ పథకం సాఫీగానే సాగగా, ఇంటి వద్దే ఉంటున్న నిరుపేదలైన వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందాయి.

నిధుల కొరత

దగ్గరి వారి ఆదరణకు నోచుకోక నిరాశ్రయులైన వ్యాధిగ్రస్తులను ఈ పథకం కింద గుర్తించి కొన్నినెలల పాటు వైద్యసేవలు అందించారు. ప్రతి రోజు కనీసం 15 మంది రోగుల ఇళ్లకు వైద్య సిబ్బంది నేరుగా వెళ్లి వారికి మందులతో పాటు వైద్య సేవలు అందించారు. రాను రాను ఈ పథకానికి ఆదరణ తగ్గింది. నిధులు మంజూరు కాకపోవడం, జిల్లాలో తగినంత సిబ్బంది లేకపోవడంతో పథకాన్ని నిలిపివేశారు. ఇందుకోసం కేటాయించిన వాహనాలను అలాగే వదిలేయడంతో తప్పుపట్టి చెడిపోయాయి. ఇదే విషయమై తూప్రాన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ అమర్‌సింగ్‌ను వివరణ కోరగా.. ఆలన పథకం రద్దు అయిందని తెలిపారు. ప్రభుత్వం పునరుద్ధరిస్తే సేవలు కొనసాగిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement