జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సంగారెడ్డిలోని మంత్రి స్వగృహంలో కలిశారు. వారితో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. నెలలో ఒక వారం పర్యటించేలా ప్రణాళికను తయారు చేసుకుంటానని చెప్పారు. పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌ను మంత్రి ప్రశ్నించగా.. 230 ఆన్‌లైన్ అయ్యాయని, మరో 140 ఆన్‌లైన్ సమస్యలు ఉన్నాయని కమిషనర్ వివరించారు. అజ్జమర్రి–జోగిపేట బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించాలని, ఈ పనులు పూర్తయినట్లయితే సుమారుగా 23 గ్రామాల ప్రజలు జోగిపేటకు వివిధ పనుల నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుందని దీనివల్ల వ్యాపారాలు పెరిగి, స్థానిక వ్యాపారులకు జీవనోపాధి లభించనుందని మంత్రి తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ రికార్డు స్థాయిలో జరిగింది. ప్రభుత్వం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సన్న బియాన్ని లబ్ధిదారులకు విజయవంతంగా అందించింది. గతంలో నెల వారీ పంపిణీలో ఎన్నడూ 88శాతానికి మించని రేషన్ ఈ సారి ఒకే నెలలో మూడు నెలల కోటాను 90.84శాతం పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. మళ్లీ రేషన్ బియాన్ని జూలైలోనే పంపిణీ చేయనున్నారు. – సాక్షి, సిద్దిపేట


