హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు రోజు కేంద్రాలను తనిఖీ చేస్తూ నిర్వాహకులకు చెబుతున్నారు. కానీ కాంటా పూర్తయిన తర్వాత బస్తాలను మిల్లులకు తరలించడానికి లారీలు పంపించడంతో శ్రద్ధ చూపడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కొన్ని చోట్ల హమాలీలు ధాన్యం కాంటా వేసినా లారీలు రాక రైతులు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని చోట్ల హమాలీలు లేక కాంటా సాగడం లేదు. అకాల వర్షాలు భయపెడుతుండటంతో రైతులు ఏం చేయాలో తోచక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో అధికారులు స్పందించి సరైన సమయంలో ధాన్యం తరలించేలా చూడాలని వేడుకుంటున్నారు.


